Olympic Gold Medalist Neeraj Chopra: ఇండియన్ గోల్డెన్ బాయ్.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని అందించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. జావెలిన్ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధిస్తున్న నీరజ్ జావెలిన్ త్రోలో..
Olympic Gold Medalist Neeraj Chopra: ఇండియన్ గోల్డెన్ బాయ్.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని అందించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. జావెలిన్ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధిస్తున్న నీరజ్ జావెలిన్ త్రోలో నంబర్‌వన్ ర్యాంక్ సాధించాడు. దీంతో ఆ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా కూడా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్ 1455 పాయింట్లతో.. ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్‌ని వెనక్కి నెట్టి మరీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
అంతే కాకుండా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో నంబర్‌వన్ స్థానంలో నిలిచిన తొలి భారత అథ్లెట్‌గా కూడా నీరజ్ రికార్డుల్లో నిలిచాడు. గత సీజన్లో డైమండ్ లీగ్ ఫైనల్స్ విజేతగా నిలిచిన నీరజ్.. ఈ ఏడాది దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలోనూ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నెదర్లాండ్స్‌లో జూన్ 4న జరిగే ఫానీ బ్లాంకర్స్ కొయెన్(ఎఫ్‌బీకే) ఈవెంట్ల కోసం త్వరలోనే బరిలో దిగబోతున్నాడు.
కాగా, నీరజ్ చోప్రా తన జావెలిన్‌ని టోక్యో ఒలంపింక్స్‌లో 87.58 మీటర్లు, జ్యూరిక్ డైమండ్ లీగ్‌లో 88.44 మీటర్ల దూరం.. తాజాగా దోహా డైమండ్ లీగ్‌లో 88.67 మీటర్ల దూరం విసిరి భారత్‌కి పసిడి పతకాలను తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాగైనా 90 మీటర్ల దూరాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు నీరజ్. మరోవైపు ఎఫ్‌బీకే టోర్నీలో అయినా నీరజ్ ఆ లక్ష్యాన్ని సాధించాలని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.