విశాఖ బీచ్ రోడ్ లో వైజాగ్ నేవీ మారథాన్ -2023 ఉత్సాహంగా సాగింది. ఇప్పటివరకు విశాఖలో ఏడుసార్లు ఈ మారథాన్ నిర్వహించారు. ఈరోజు ఎనిమిదో ఎడిషన్ మారథాన్ లో విశాఖవాసులు, క్రీడాకారులు, ఔత్సాహికులు భారీగా మారథాన్‌లో పాల్గొన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కె, 5కే విభాగాల్లో పరుగు నిర్వహించారు.
సుందర సాగర తీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. తెల్ల తెల్లవార జాము.. ఆదివారం.. లేలేత సూర్యుని కిరణాలు పలకరిస్తుండగా పరుగు పెడుతుంటే.. ఆ అనుభూతే వేరు. ఎక్కడలేని శక్తి మొత్తం ఒక్కసారిగా వచ్చినట్టు.. పట్టలేనంత ఉత్సాహం. వెరసి వైజాగ్ నేవీ మారథాన్ – 2023 ఉత్సాహంగా హుషారుగా సాగింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, క్రీడాకారులతో సాగర తీరం కిక్కిరిసిపోయింది. మామ్ అండ్ డాడ్ తో మేము సైతం అంటూ చిన్నారులు, బుజ్జాయిలు ఉత్సాహంగా మారథాన్ లో పాల్గొనడం విశేషం.
విశాఖ బీచ్ రోడ్ లో వైజాగ్ నేవీ మారథాన్ -2023 ఉత్సాహంగా సాగింది. ఇప్పటివరకు విశాఖలో ఏడుసార్లు ఈ మారథాన్ నిర్వహించారు. ఈరోజు ఎనిమిదో ఎడిషన్ మారథాన్ లో విశాఖవాసులు, క్రీడాకారులు, ఔత్సాహికులు భారీగా మారథాన్‌లో పాల్గొన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కె, 5కే విభాగాల్లో పరుగు నిర్వహించారు.
తెల్లవారుజామునుంచే..
తెల్లవారుజాము నుంచే భారీగా జనం మారథాన్‌లో పాల్గొనేందుకు బీచ్ రోడ్డుకు చేరుకున్నారు. తొలుత ఫుల్ మారథాన్ ను ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభించారు. హాఫ్ మారథన్ ను ప్రారంభించారు వైస్ అడ్మినల్ శ్రీనివాసన్. 10కె రన్ ను సీపీ రవిశంకర్ అయ్యనార్ ప్రారంభించారు.
నాలుగు విభాగాల్లో పరుగు..
ఈ ఈవెంట్లో 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిమీ రన్, 5 కిమీ రన్ నాలుగు విభాగాల్లో పరుగు నిర్వహించారు. ది పార్క్ హోటల్ సర్కిల్ నుంచి RK బీచ్, నావల్ కోస్టల్ బ్యాటరీ వైపు వెళ్లి.. RK బీచ్ కాళీమాత ఆలయం దగ్గర U-టర్న్ తీసుకున్నారు. 5K రన్ MGM పార్క్, VMRDA వద్ద ముగిసింది. 10కె రన్నర్లు తెన్నేటి పార్క్ దగ్గర యు-టర్న్ తీసుకున్నారు. హాఫ్ మారథాన్ రన్నర్లు రుషికొండ సమీపంలోని గాయత్రి కళాశాల దగ్గర యు-టర్న్ తీసుకుని తిరిగి వచ్చేసారు. ఫుల్ మారథాన్ రన్నర్లు INS కళింగ సమీపంలోని చేపల ఉప్పాడ దగ్గర U-టర్న్ తీసుకున్నారు. అన్ని రేసులు MGM పార్క్, VMRDA వద్ద ముగిసాయి.
ఈ సంవత్సరం మారథాన్‌కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా మెడికల్ క్యాంపులతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శారీరక మానసిక ఆరోగ్యానికి మారథాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు ఈ ఎన్ సి చీఫ్ రాజేష్. విశాఖ వాసుల నుంచి వస్తున్న స్పందనతో మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అశేషంగా హాజరైన జనంతో మరింత స్ఫూర్తి నింపిందన్నారు అడ్మిరల్ శ్రీనివాసన్. ఏటా మారథాన్ నిర్వహిస్తున్న నేవీని అభినందించారు సిపి రవిశంకర్ అయ్యనార్. తల్లిదండ్రులతో పాటు చిన్నారులు కూడా ఈ మారథాన్‌లో పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది.