Andhra Pradesh Political News: ఇద్దరు వైసీపీ నేతలపై నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. తనపైన, తన కుటుంబం పైన దుష్ప్రచారం చేశారంటూ వారిపై ఇప్పటికే పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై ఈనెల 14న లోకేష్ వాంగ్మూలం రికార్డ్ చేయనుంది మంగళగిరి కోర్టు.
ఇద్దరు వైసీపీ నేతలపై నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. తనపైన, తన కుటుంబం పైన దుష్ప్రచారం చేశారంటూ వారిపై ఇప్పటికే పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై ఈనెల 14న లోకేష్ వాంగ్మూలం రికార్డ్ చేయనుంది మంగళగిరి కోర్టు. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టితో యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చి మంగళగిరికి చేరుకోనున్నారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ప్రకటించారు. 14న మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో లోకేష్ వాంగ్మూలం ఇస్తారు. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పెట్టిన కొన్ని పోస్ట్‌లపై లోకేష్ తీవ్ర అభ్యంతరంతెలిపారు. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. కొద్ది నెలల కిందట లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనేది లోకేష్ ఆరోపణ. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్45లో ఉన్న 5.73 ఎకరాల భూవివాదమే కారణం అంటూ దేవేందర్‌రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఆరోపణలు అసత్యమని తేలడంతో తర్వాత మరో తప్పుడు వార్త ప్రచారంలోకి తెచ్చారనేది లోకేష్ వాదన.
హెరిటేజ్‌లో 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ తప్పుడు కథనాలు ఇచ్చారని అంటున్నారు. ఈ విషయంపై పరువునష్టం పిటిషన్ వేశారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి నోటీసులు పంపినా.. ఆయన పనిచేస్తున్న కార్యాలయాల దగ్గర నోటీసులు ఎవరూ తీసుకోకపోవడంతో.. చివరికి వాట్సప్‌లో నోటీసులు పంపారు.
అలాగే YCP ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తమ కుటుంబం పరువుకు భంగం కలించారంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 2022లో తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో పోతుల సునీత మాట్లాడిన మాటల్ని ఆయన మేజిస్ట్రేట్ ముందుకు తెచ్చారు. నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని సునీత మాట్లాడడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెప్తూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అంటూ కూడా ఆమె మాట్లాడారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారనే ఆరోపణలు కూడా చేశారని.. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇంకా చాలా దారుణమై వ్యాఖ్యలు చేశారని లోకేష్ కోర్టు దృష్టికి తెచ్చారు.
గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై దాఖలు చేసిన కేసుల్లో IPC సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్ నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం నమోదు చేయనున్నారు.