పలు ప్రశ్నలకు మౌనం దాల్చిన వైకాపా నేత
అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి సమయంలో తానక్కడ లేనని చెప్పిన మాజీ ఎంపీ నందిగం సురేష్..
ఆయన అక్కడే ఉన్నట్టు సాంకేతిక ఆధారాలను చూపించి పోలీసులు ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. అటుగా వెళ్తుండగా ఏదో అలజడి జరుగుతోందని తెలుసుకుని పరిశీలించానంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన్ను కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నుంచి కస్టడీలో విచారిస్తున్నారు. సోమవారం అడిగిన పలు ప్రశ్నలకు సురేష్ అసలు సమాధానమే చెప్పలేదని, కొన్నింటికి పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించి కొంత విలువైన సమాచారం రాబట్టినట్టు తెలిసింది.
దాడికి వైకాపా కేంద్ర కార్యాలయం నుంచే బయల్దేరారు కదా.. మీరు అక్కడ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో ఉన్న చిత్రాలివిగో అని చూపగా.. తానా రోజు వేరే మార్గంలో వచ్చానని, ఆ తర్వాతే అప్పిరెడ్డిని వైకాపా కార్యాలయంలో కలిశానంటూ పొంతన లేకుండా సమాధానం చెప్పినట్టు సమాచారం. దీంతో పోలీసులు ఆయన గన్మన్ల నుంచి నమోదు చేసుకున్న వాంగ్మూలాన్ని ముందుపెట్టి ప్రశ్నించేసరికి ఏమీ మాట్లాడలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ముగియనుంది. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెడతారు.