ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు నడకుదిటి నరసింహ రావు..!
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర..!
మచిలీపట్నం ఆగస్టు 19 (ఆంధ్రపత్రిక) :
బందరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు
నడకుదిటి నరసింహా రావు , అని వీరిని చరిత్ర ఉన్నంత కాలం బందరు ప్రజలు మరచిపోరని కొల్లు రవీంద్ర పునరుద్ఘాటించారు.
మాజీమంత్రి నరసింహ రావు 72 వ జయంతి సందర్భంగా మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ
సామాన్యమైన కుటుంబంలో జన్మించిన నరసింహా రావు అంచెలంచెలుగా ఎదిగి మచిలీపట్నం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోయారన్నారు. బందరు అభివృద్ధి కోసం తాను బ్రతికినంత కాలం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. బందరు అభివృద్ధి కోసం ఎంతో తపన పడేవారని మా అందరికి కూడా అదే విధంగా మార్గదర్శకం చేసేవారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ మంత్రిగా ఎంతో సేవచేశారన్నారు.
బిసి సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ రాష్ర్టంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం బిసి హాస్టల్సు, బిసి రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుతో బాటు ప్రత్యేకంగా మత్స్యకార విద్యార్థుల కోసం రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణం ఆయన హయాంలోనే నిర్మించేలా కృషి చేయడం మరచిపోలేనదన్నారు. అంతేకాదు బందరు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మనం చూస్తున్న పల్లె తుమ్మలపాలెం లో భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ, కేంద్రీయ విద్యాలయం, ఫిషింగ్ హార్బర్, ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన సముదాయం, 34 పంచాయితీల్లో కరెంటు స్తంబాలు, మత్య్సకారులు వేటకు వినియోగించే వైర్ లెస్ సెట్లు, పంపుల చెరువు, తరకటూరు సమ్మర్ స్టోరేజీ ఆధునీకరణ వీరి హయాంలో చేపట్టడం జరిగిందన్నారు.
ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కడ ఒక అవినీతి మచ్చలేకుండా తన మంత్రి పదవిని నిర్వర్తించిన గోప్పవ్యక్తి, అందరికీ ఆదర్శప్రాయుడు నరసింహారావు అని రవీంద్ర నరసింహారావు సేవలు కొనియాడారు. ఆయన లేనిలోటు ఎప్పటికీ తీరనిదని అన్నారు. వీరి ఆశయాలు ముందకు తీసుకెళ్లడంలో తామంతా అన్నివిధాలుగా కృషి చేస్తాం అన్నారు. రాబోవు కాలంలో నరసింహ రావు ఆశయాల సాధనకు అందరూ కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
బందరు అభివృద్ధిలో నరసింహరావు పాత్ర చిరస్మరణీయమైనది అని తెలిపారు. పదవులకోసం ఏ రోజు తపన చెందని వ్యక్తి నరసింహ రావు అని పదవులు ఆయనను కొరివచ్చినవే తప్ప కోరి తెచ్చు కున్నవి కావని అన్నారు.అందుకే ఎన్నడూ పదవి చూసుకుని గర్వం పడలేదన్నారు. మారుమూల ప్రాంతం అభివృద్ధికి నడుంబిగించి ఢిల్లీవరకు వెళ్ళి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిన వ్యక్తి నరసింహ రావు అని అన్నారు. బందరులో 11 గ్రామాల ప్రజలకు భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ ద్వారా ఈ రోజుకు ఉపాధి దొరుకు తుంది అంటే అది నరసింహా రావు కృషి అని చెప్పక తప్పదన్నారు. పంపుల చెరువు, తరకటూరు సమ్మర్ స్టోరేజీ, కేంద్రీయ విద్యాలయం, కరెంటు స్తంబాలు ఇలా అనేకమైన అభివృద్ది కార్యక్రమాలకు బందరులో శ్రీకారం చుట్టింది నడకుదిటి నరసింహారావు అని చెప్పక తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గొర్రెపాటి గోపి చంద్, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, ఇలియాన్ పాషా, కాంతారావు, మహిళా కార్యకర్తలు పెద్ద యెత్తున పాల్గొని నరసింహ రావు చిత్ర పటానికి నివాళులర్పించి నరసింహ రావు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.