సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన సిటింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని మోదీ అభివర్ణించారు.
ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేశారు.
వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం కాశీవిశ్వనాథుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు మోదీ బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.