క్రమశిక్షణ పేరుతో అమానవీయతరంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అమానవీయత
50 మంది విద్యార్థినులకు అస్వస్థత
కాళ్ల నొప్పులతో విలపిస్తున్న విద్యార్థినులు
రంపచోడవరం, న్యూస్టుడే: విద్యార్థినులు తన మాట వినడం లేదని ఆగ్రహానికి గురైన ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరుతో శిక్ష విధించారు. ఏకంగా మూడు రోజుల పాటు వారికి గుంజీల దండన విధించారు. నాలుగో రోజున ఆ బాలికలు ఇక తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో విషయం వెలుగు చూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు.. తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి భావించారు. ఇందుకు శుక్రవారం నుంచి వారితో రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయించారు. ఇలా మూడు రోజుల నుంచి జరుగుతోంది. సోమవారం కూడా అలాగే చేయడంతో 50 మంది వరకు విద్యార్థినులు కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వెంటనే కళాశాలకు చేరుకుని విద్యార్థినులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సాయంత్రానికి కోలుకున్న వారిలో కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు.
విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశం
క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆమె సందర్శించి బాలికలతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులూ రావడం లేదు. నా సొంత డబ్బుతో మీ అందరికీ భోజనం పెడుతున్నాను’ అని ప్రిన్సిపల్ అంటున్నట్లు బాలికలంతా ఎమ్మెల్యే ఎదుట కంట తడిపెట్టారు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని వారికి ఎమ్మెల్యే భరోసానిచ్చారు.