మణిపూర్ ఘటనలో మోదీ బాధ్యతారాహిత్యం
విజయవాడ,జూలై 25 (ఆంధ్రపత్రిక): సభ్య సమాజం తలదించుకునే విధంగా మణిపూర్ లో జరిగిన హత్యాచారాలు, దాడులు విషయంలో ప్రధాని మోడీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. అన్ని విభాగాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో మణిపూర్ దారుణాలతో పాటు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలపై ప్రధానంగా చర్చించారు. బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి అన్ని అంశాలను చర్చించి ఒక డిక్లరేషన్ ప్రకటిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. డిక్లరేషన్ లో ప్రకటించిన అంశాలనే తాము మేనిఫేస్టోలో కూడా పెడతామని ఆయన ప్రకటించారు.రాష్ట్ర సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన రుద్రరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు మణిపూర్ ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కూడా మణిపూర్ దారుణాలపై సరైన చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. కులాలు, మతాలు, జాతుల మధ్య చిచ్చు పెడుతూ అధికారాన్ని సాధించాలన్న నీచమైన ఆలోచనలతో బీజేపీ అధిష్టానం ఉందని దుయ్యబట్టారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పుణ్యమా అని రక్తపుటేరులు పారుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనను కేంద్రం అడ్డుకున్నా కాంగ్రెస్ అధిష్టానం మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక వంటి అగ్ర నేతలు అనేక రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారని పీసీసీ చీఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అదే విధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని రుద్రరాజు చెప్పారు. సబ్ ప్లాన్ నిర్వీర్యం చేయడంతో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యా, ఉపాధి అవకాశాలపై కూడా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందన్నారు. ఎస్సీలకు సంబంధించిన 16 అంశాలలో తీరని అన్యాయం జరిగిందని ఆయన వెల్లడిరచారు. డిక్లరేషన్ పై పూర్తి స్థాయిలో చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని దానికి అనుగుణంగ భవిషత్తు కార్యచరణ చేపడతామని రుద్రరాజు రాష్ట్ర సదస్సుల్లో వెల్లడిరచారు.
మమ్మల్ని ఆదుకోవాలి: గంగవరం పోర్టు బాధితులు
గంగవరం పోర్టుకు భూములిచ్చిన వారికి తీరని అన్యాయం జరిగిందని తమకు న్యాయం చేయాలని బాధితులు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుకు రాష్ట్ర సదస్సులో వినతిపత్రం ఇచ్చారు. పోర్టు యాజమాన్యం అదానీ గ్రూప్ తమ శ్రమను దోచుకుంటుందని బాధితుల పక్షాన అప్పారావు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పక్షాలు తమను ఆదుకోవాలని ఆయన కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గంగవరం పోర్టు బాధితుల పక్షాన ఉంటుందని హామీ ఇచ్చారు. అదే విధంగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ గంగవరం పోర్టు బాధితుల పక్షాన వారి వాణిని వినిపిస్తామని స్పష్టం చేశారు.
మణిపూర్ బాధితులకు నివాళులు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర సదస్సు ప్రారంభానికి ముందు ఉమ్మడి 13 జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు అందరూ మణిపూర్ అల్ల ర్లలో ప్రాణాలు పోగొట్టుకున్న బాధితులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. నిందితులకు శిక్ష పడే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని నినదించారు. అదే విధంగా కులమతాలు, జాతులకు అతీతంగా నేరస్తులను శిక్షించాలని సంబంధిత యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
కోలాహలంగా ఆంధ్రరత్న భవన్…
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్ మంగళవారం కోలాహలంగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలతో సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రరత్న భవన్ మొదటి అంతస్తు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో కిటకిటలాడిపోయింది. వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చేతుల మీదుగా పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన వారందరినీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.