Modi Cabinet: రైల్వే ఉద్యోగులకు, రైతులకు ముందే వచ్చిన దీపావళీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్
ANDHRAPATRIKA : – పండుగ సీజన్లో భారతీయ రైల్వే ఉద్యోగులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభవార్త ప్రకటించారు. మోదీ నేతృత్వంలోని NDA సర్కార్ పెద్ద బహుమతిని అందించింది.
గురువారం (అక్టోబర్ 3) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ ఆమోదించింది. సాయంత్రం జరిగిన కేబినెట్ బ్రీఫింగ్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు.
రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్
కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా, రైల్వే ఉద్యోగులకు బోనస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. ఇందుకు మొత్తం 2,029 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది మొత్తం 78 రోజుల బోనస్ అవుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 11,72,240 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం రైల్వేలో 58,642 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
రైతులకు శుభవార్త
రైల్వే ఉద్యోగులతో పాటు రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయం పెంపు, ఆహార భద్రత దృష్ట్యా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి రాష్ట్ర కృషి వికాస్ యోజన, కృషి ఉన్నతి యోజనలకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.1,01,321 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) 2007-08 నుండి వ్యవసాయ రంగంలో 4% వార్షిక వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, సహకార శాఖ (DAC) క్రింద ప్రారంభించింది.
ఎడిబుల్ ఆయిల్స్‌పై జాతీయ మిషన్ ఏర్పాటు : –
రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఈ రెండు పథకాలు కూడా తక్కువ ఆదాయం, మధ్య ఆదాయ ప్రజలకు ఆహార భద్రత ప్రయోజనాలను అందిస్తాయి. దీనితో పాటు, ఎడిబుల్ ఆయిల్స్‌పై జాతీయ మిషన్‌కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,103 కోట్లు వెచ్చించనుంది. అలాగే, రూ. 63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో ఫేజ్-2కి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు, మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీతో సహా మరో 5 భాషలకు ప్రభుత్వం శాస్త్రీయ భాష హోదాను ఇచ్చింది. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు ఇప్పటికే ఈ విభాగంలో ఉన్నాయి.