హైదరాబాద్: ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో నిన్న (గురువారం) రచ్చరచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ కచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్తానంటూ సవాలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంట్లో ఉన్నారు.
ఇంటి బయట పోలీసులు పహారా కాస్తున్నారు. పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..
తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటున్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి నిజంగా రాజకీయ నియమాలు ఉంటే వెళ్లి కేసీఆర్‌ను కలవాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కులమతాలు, ప్రాంతీయ విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. ”మా కార్యకర్తలను నిర్బంధించిన పోలీసులు కాంగ్రెస్ నాయకులను మాత్రం స్వేచ్చగా వదులుతున్నారు” అని ఆయన అన్నారు. కాగా మీడియాతో మాట్లాడేందుకు కౌశిక్ రెడ్డి నిరాకరించారు. ఇదిలావుండగా.. కుత్బుల్లాపూర్‌లో శంభీపూర్ రాజు హౌస్ అరెస్ట్‌లో భాగంగా ఆయన నివాసం వద్ద ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీసీఎం వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో ‘జై తెలంగాణ’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఇదీ వివాదం..
గత రెండు రోజులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని కౌశిక్ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో గురువారం దాదాపు గంటన్నరపాటు అక్కడి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌కు హరీశ్, కౌశిక్ తరలించారు.
ఈ పరిణామంపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ దాడి అని అభివర్ణించారు. గాంధీ ఇంటిని శుక్రవారం కచ్చితంగా ముట్టడిస్తానని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ”ఏం జరుగుతుందో మీరే చూస్తారు” అని శపథం చేశారు. పోలీసుల వైఫల్యం కారణంగా ఇంత రచ్చ జరిగిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాగా కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.