అధికార పార్టీ తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి
హైదరాబాద్,డిసెంబర్ 10 (ఆంధ్రపత్రిక): సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రధాని మోడీ కూడా సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారని కేసీఆర్ కుటుంబం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. శనివారం పార్టీ కార్యలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ..బీజేపీని ప్రజలు ఆదరించడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. ఏ రాష్ట్రంపై కేంద్రానికి వివక్ష ఉండదన్నారు. బొగ్గు గనులను బహిరంగ వేలం ద్వారనే కేటాయిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో బొగ్గుగనుల కేటాయింపుల్లో చాలా కుంభకోణాలు జరిగాయని.. వాటన్నింటిని నరేంద్రమోడీ ప్రక్షాళన చేశారన్నారు. తెలంగాణకు ఇవ్వకుండా గుజరాత్ కు బొగ్గుగనులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందన్నారు. ఏ ఒక్క కోల్ బ్లాక్‌ను ఇష్టానుసారంగా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పారదర్శకంగా బొగ్గుగనుల వేలం జరుగుతుందన్నారు. దీనిపై గతంలోనే క్లారిటీ ఇచ్చామన్నారు. అయినా కావాలనే దుష్ప్రచారం చేస్తూ కార్మికుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు ఓయూ ప్రభుత్వ పాఠశాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్‌ను ఆయన పంపిణీ చేశారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిషన్ల పంపిణీ జరిగింది. క్లీనింగ్ మిషన్‌తో టాయిలెట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుభ్రం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలన్నారు.