హైదరాబాద్: పీవీఆర్ మల్టీప్లెక్స్ (PVR Multiplex) తీరుపై డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ (Mythri Movies) ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం కోసం నిర్మాతల మండలిని ఆశ్రయించింది.
ఏం జరిగిందంటే? మలయాళ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys)ను ‘మైత్రీ మూవీస్’ తెలుగులో డబ్ చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాతలతో నెలకొన్న వివాదం కారణంగా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలను గురువారం అర్ధంతరంగా నిలిపివేసింది. దీంతో, మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. సినిమా మంచి వసూళ్లు రాబడుతుండగా నిలిపివేయడంపై మండిపడ్డారు. మలయాళం నిర్మాతతో ఇబ్బంది ఉంటే తెలుగు వెర్షన్ ఎలా ఆపుతారని ప్రశ్నించారు. పీవీఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారంపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా (గ్రాస్) వసూళ్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా (the highest grossing Malayalam film ever) నిలిచిందీ చిత్రం. శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.