మచిలీపట్నం సెప్టెంబర్ 30 ఆంధ్ర పత్రిక.:
అక్టోబర్ 1వ తేదీ నుండి కృష్ణా జిల్లాలో మొదలు కానున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాలోని అవనిగడ్డ నుంచి వారాహియాత్ర ప్రారంభిస్తారని అన్నారు. రానున్న ఎన్నికలలో భాగంగా టిడిపి, జనసేన కలసి పనిచేయనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతం అయ్యేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు తోడుగా టిడిపి నాయకులు కార్యకర్తలు కూడా శ్రమించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మచిలీపట్నంలో రెండు, మూడు తారీకులలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని తెలిపారు. అలాగే నాలుగో తేదీన పెడన నియోజవర్గంలోని తోట మూలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ఆ సభను జయప్రదం చేయాలని వేదవ్యాస్ తెలిపారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా సమిష్టిగా సహకరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ వారాహియాత్ర తో జిల్లాలో రాజకీయంగా సమూల మార్పులు రానున్నాయని వేదవ్యాస్ తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లా అతి త్వరలో బయటకు వస్తారని ప్రజల ప్రార్థనలు వృధా కావని అన్నారు.