సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ అగ్ర దర్శకులు, నిర్మాతలు మహేష్ బాబుతో సినిమాలు తీస్తామని, పారితోషికం కింద ఎంతైనా ఇస్తామంటూ ముందుకు వచ్చినప్పటికీ హిందీలో సినిమా చేయడానికి ప్రిన్స్ ఒప్పుకోలేదు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటికే జర్మనీ వెళ్లి శిక్షణ తీసుకున్నారు.
పరిశ్రమపై చెరిగిపోని ముద్ర
తెలుగు సినీ పరిశ్రమ దశను, దిశను మార్చిన దర్శకుల్లో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. ఆయన తొలి చిత్రం శివతో పరిశ్రమపై చెరిగిపోని ముద్ర వేశారు. ఎంతోమంది యువకులు వర్మను స్ఫూర్తిగా తీసుకొని దర్శకులవడానికి పరిశ్రమలోకి వచ్చారు. ప్రస్తుతం అగ్ర దర్శకులుగా కొనసాగుతున్నవారిలో ఆయన శిష్యులే అధికం. నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్లతో చేశారు. మహేష్ బాబు రాజకుమారుడు చిత్రం చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఒక కథ తీసుకొని కృష్ణను కలిశారు. అయితే కృష్ణకు ఆ కథ నచ్చలేదు.
ఈ కథతోనే సినిమా చేస్తానన్న వర్మ
ఇది నచ్చలేదు కాబట్టి మరో కథ తీసుకురావాలని, దాంతో చేద్దామని చెప్పారు. అయితే తాను ఈ కథతోనే సినిమా చేస్తానని, మరో కథతో అయితే చేయనని కృష్ణకు కుండబద్ధలు కొట్టినట్లు వర్మ చెప్పేశారు. దీంతో వారి కాంబోలో రావాల్సిన సినిమా పట్టాలెక్కలేదు. ఆయన శిష్యులు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మాత్రం పోకిరి, బిజినెస్మెన్, కృష్ణవంశీతో మురారి, గుణశేఖర్ తో ఒక్కడు, అర్జున్, సైనికుడు చిత్రాలు చేశారు.
ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండేదని ఎంతోమంది అభిప్రాయపడేవారు. అనుకోవడానికి కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కానీ అవి పట్టాలెక్కవు. అలాంటివాటిలో వర్మ, మహేష్ బాబు కాంబినేషన్ కూడా ఒకటి. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా ప్రిన్స్ కొనసాగుతున్నారు.