రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేష సాయి..!
మచిలీపట్నం సెప్టెంబర్ 17 ఆంధ్ర పత్రిక : సహనంలో మహాత్మా గాంధీ, జ్ఞానంలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్, ధైర్యంలో అల్లూరి సీతారామరాజు, సాహసంలో టంగుటూరి ప్రకాశం పంతుల్ని ఆదర్శంగా తీసుకున్నపుడు సంపూర్ణ న్యాయవాదిగా ఎదుగుతారని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కృష్ణాజిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేష సాయి పేర్కొన్నారు.ఆదివారం ఆయన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వీ ఆర్ కే కృపాసాగర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ సారిక లతో కలసి స్థానిక జిల్లాకోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు మొదటి అంతస్తు భవనాన్ని ప్రారంభించారు. ఆయన నూతన భవనంలోని కోర్టు హాలుతో పాటు బాధితుల నిరీక్షణ హాలు, న్యాయమూర్తి చాంబరు, ఆఫీస్ రూమ్ లను ప్రారంభించి పరిశీలించారు.
అనంతరం మచిలీపట్నం బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ వ్యవస్థకు ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, న్యాయవాదులను అందించిన ఘనత కృష్ణాజిల్లా బార్ అసోసియేషన్ కు దక్కుతుందని అన్నారు. దీనిలో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఏ బార్ అసోసియేషన్ లలో ఏ సీనియర్ న్యాయవాదులు ఆక్టివ్ గా ఉంటున్నారో ఆ బార్ అసోసియేషన్ లలో క్రమశిక్షణ, మంచి సాంప్రదాయం ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాదులు జ్ఞానం పరంగా, వయసు రీత్యా వారు జాతి సంపద అని, అటువంటి వారిని మనం గౌరవించుకోవడం ద్వారా మనకు మార్గ నిర్దేశం చేస్తారని అన్నారు.
అదే విధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వీ ఆర్ కే కృపా సాగర్ మాట్లాడుతూ తన సొంత బార్ అసోసియేషన్ మచిలీపట్నంనకు మరల రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కొత్త కోర్టులు, భవనాలు ఏర్పాటు కావడానికి బార్ అసోసియేషన్ కృషి అభినందనీయం అన్నారు.
ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ సారిక, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజులుల్లా, పదవ అదనపు జిల్లా జడ్జి ఏ.నరసింహమూర్తి, ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎస్.చిన్నబాబు, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి.హరిబాబు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.