బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంతాల్లో అంచనాలకు అందని స్థాయిలో వర్షపాతం నమోదయింది. 2 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంతాల్లో అంచనాలకు అందని స్థాయిలో వర్షపాతం నమోదయింది. 2 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తరహాలో మరో 2 రోజులు కూడా వర్షాలు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకా అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, నంద్యాల, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గ్యాప్ లేకుండా భారీ వర్షం కుమ్మేయడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. ఇంకా సాయిబాబా ఆలయం జంక్షన్లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఇంకా వాహన రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఇదిలా కొనసాగుతుండగానే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు కిందపడ్డాయి. వరదనీటిలో తేలియాడుతున్న పాల ప్యాకెట్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.