తెలుగులో ఈ మధ్య డిఫెరెంట్ సినిమాలు చాలానే వస్తున్నాయి. అలా వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. కరోనా టైమ్‌లో ఓటిటిలో వచ్చిన ఈ చిత్రం ఊహించిన విజయం సాధించింది. దాంతో దీనికి సీక్వెల్ చేసారిప్పుడు. మరి మా ఊరి పొలిమేర 2 ఎలా ఉంది.. పార్ట్ 1 మాదిరే ఇది కూడా భయపెడుతుందా అనేది రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: మా ఊరి పొలిమేర 2
నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకెందుమౌళి, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫర్: కుశేదర్ రమేష్ రెడ్డి
ఎడిటర్: శ్రీ వర
సంగీతం: జ్ఞాని
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాణ సంస్థ: శ్రీ కృష్ణ క్రియేషన్స్
తెలుగులో ఈ మధ్య డిఫెరెంట్ సినిమాలు చాలానే వస్తున్నాయి. అలా వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. కరోనా టైమ్‌లో ఓటిటిలో వచ్చిన ఈ చిత్రం ఊహించిన విజయం సాధించింది. దాంతో దీనికి సీక్వెల్ చేసారిప్పుడు. మరి మా ఊరి పొలిమేర 2 ఎలా ఉంది.. పార్ట్ 1 మాదిరే ఇది కూడా భయపెడుతుందా అనేది రివ్యూలో చూద్దాం..
కథ:
కొమ్రు (సత్యం రాజేష్) ఊరి నుంచి పారిపోయి కేరళలో ఉంటాడు. మరోవైపు కొమ్రు తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) కనిపించకుండా పోతాడు. లక్ష్మి (కామాక్షి) ఊళ్లో బాబుతో కలిసి బతుకుతుంటుంది. అదే సమయంలో ఊళ్లో సర్పంచులు వరసగా గుడిలోనికి వెళ్లి చనిపోతూ ఉంటారు. సరిగ్గా ఆ టైమ్‌లోనే ఊరికి కొత్తగా ఎస్సై (రాకెందుమౌళి) వస్తాడు. వచ్చీ రాగానే జంగయ్య మిస్సింగ్ కేసుపై ఫోకస్ పెడతాడు. ఆ క్రమంలోనే జంగయ్య గురించి కాకుండా.. కొమ్రు గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరోవైపు మాల వేసుకున్న కారణంగా శబరికి వెళ్తాడు బలిజ (గెటప్ శ్రీను). అక్కడే కొమ్రును చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఊరంతా చనిపోయాడనుకుంటున్న కొమ్రు కేరళలో ఏం చేస్తున్నాడు అనేది అసలు కథ.
కథనం:
కరోనా టైమ్‌లో ఖాళీగా ఉన్నపుడు చాలా మంది చూసిన సినిమా పొలిమేర. ఏదో టైమ్ పాస్‌గా మొదలుపెట్టినా.. తర్వాత మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది ఈ చిత్రం. చేతబడులు, ఊరి పొలిమేర అంటూ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో పొలిమేర తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఎవర్రా ఈ డైరెక్టర్ ఇలా తీసాడు అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ముఖ్యంగా పొలిమేర సినిమాలో ట్విస్టులు హైలైట్.. క్లైమాక్స్ అయితే మరీనూ. దానికి సీక్వెల్ అంటే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలతోనే వెళ్లిన ఆడియన్స్‌కు మా ఊరి పొలిమేర 2 ఆ స్థాయిలో అనిపించదు. అంచనాల మత్తులో పడి చేతబడి తడబడినట్లు అనిపించింది. ఫస్ట్ పార్ట్‌లోనూ చేతబడి సన్నివేశాలుంటాయి కానీ కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది. కానీ రెండో భాగానికివచ్చేసరికి దర్శకుడిపై అంచనాలు అనే తెలియని ఒత్తిడి పెరిగింది. బహుశా అదే కథనంపై కూడా ప్రభావం చూపించిందేమో మరి. పార్ట్ 2 కూడా తొలి అరగంట ఇంట్రెస్టింగ్గా సాగింది. ఆ తర్వాతే కథ ముందుకెళ్లనంటూ మొరాయించింది.. అక్కడే తిరుగుతూ ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకున్నా.. సెకండాఫ్ మళ్లీ అదే పంథా. లెక్కకు మించిన ట్విస్టులు కన్ఫ్యూజ్ చేస్తాయి.. దానికితోడు మాట్లాడితే వచ్చే ఫ్లాష్ బ్యాక్‌తో ఏది గతం.. ఏది ప్రస్తుతం అర్థం కాదు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథను బాగానే ఎక్స్టెండ్ చేసాడు కానీ స్క్రీన్ ప్లేలో తేడా కొట్టింది. గుడి, నిధి అంటూ మళ్లీ కార్తికేయ కథలు చెప్పాడు. పార్ట్ 2లో చాలా ప్రశ్నలు వేసి.. పార్ట్ 3 కూడా ఉందని కన్ఫర్మ్ చేసాడు దర్శకుడు అనిల్.
నటీనటులు:
సత్యం రాజేష్ మరోసారి అదరగొట్టాడు. ఆ పాత్ర కోసమే పుట్టాడేమో అనిపిస్తుంది. దానికితోడు ఆయన హావభావాలు కూడా భయపెడతాయి. కామాక్షి భాస్కర్ల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లక్ష్మి పాత్రలో ఆమె చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో గెటప్ శ్రీను అద్భుతంగా నటించాడు. బాలాదిత్య సీక్వెల్లో కనిపించే సన్నివేశాలు తక్కువే. ఇక కీలకమైన ఎస్సై పాత్రలో రాకెందుమౌళి ఆకట్టుకున్నాడు. సాహితి దాసరి సహా మిగిలిన పాత్రలు కూడా పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీం:
జ్ఞాని అందించిన సంగీతం సినిమాకు ప్రాణం. చాలా వరకు ఆర్ఆర్తోనే సినిమాను నిలబెట్టాడు. ముఖ్యంగా సస్పెన్స్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కుశేదర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. ముఖ్యంగా రాత్రి పూట సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని బాగానే క్యాప్చర్ చేసారు. శ్రీ వర ఎడిటింగ్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు అనిల్‌తో కలిసి ఇంకాస్త డిస్కస్ చేసుంటే బాగుండేది. ఎండ్ కాల్ డైరెక్టర్ కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టడానికి లేదు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ రాసుకున్న తీరు బాగున్నా.. దాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకుని పొలిమేరలో వర్కవుట్ సీన్స్ పక్కనబెట్టి.. అంచనాల వేటలో అనవసరంగా తప్పులు చేసినట్లు అనిపించింది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా మా ఊరి పొలిమేర 2.. అంచనాల మత్తులో తడబడిన చేతబడి..