లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు. అయితే సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత వారు గెలవబోయే సీట్లపై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
కార్యకర్తల నుంచి మంత్రుల వరకు తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో అంచనా వేస్తున్నారు. మెజారిటీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో 9 నుంచి 10 సీట్లు కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు. మరో రెండు చోట్ల స్వల్ప మెజారిటీ గెలిచే అవకాశం ఉందని అనాలసిస్ చేస్తున్నారు.
ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయిందని.. అది తమకే కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్ ఛార్జీలు, కో ఆర్డినేటర్లు, మంత్రులు ఓటింగ సరళిని నిశితంగా పరిశీలించారు. అటు బీజేపీ కూడా గతం కంటే మెరుగు పడినట్లు కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతున్నారు. అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. అయితే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తాయో మాత్రం అంచనా వేయకలేకపోతున్నారు. తెలంగాణలో 64 శాతం కంటే పైగా పోలింగ్ శాతం నమోదు అయింది. అదిలాబాద్ లోక్ సభ పరిధిలో 69.81 ఓటింగ్ నమోదైంది.
పెద్దపల్లిలో 63.86 శాతం, కరీంనగర్లో 67.67 ఓటింగ్ శాతం, నిజామాబాద్‌లో 67.96 శాతం, జహీరాబాద్‌లో 71.91 శాతం, మెదక్‌లో 71.33 శాతం ఓటింగ్ నమోదు అయింది. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు అంచనా వేశారు. మల్కాజిగిరిలో 46.27 శాతం, సికింద్రాబాద్‌లో 42.48 శాతం, హైదరాబాద్‌లో 39.17 శాతం, చేవెళ్లలో 53.15 శాతం, మహబూబ్ నగర్లో 68.40 శాతం పోలింగ్ నమోదయింది. నాగర్ కర్నూల్లో 66.53, నల్గొండ, భువనగిరిలో 70 శాతం, వరంగల్ లో 64.08 శాతం, మహబూబాబాద్‌లో 68.60, ఖమ్మంలో 70.76 శాతం పోలింగ్ నమోదు అయింది.