మచిలీపట్నం అక్టోబర్ 12 ఆంధ్రపత్రిక.:
ఈనెల 13వ తేదీన అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి బుధవారం, శుక్రవారం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత మండల కేంద్రాల్లో మాత్రమే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఆ ప్రకారం ఈనెల 13వ తేదీన అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండల కేంద్రంలో కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో (పెద కళ్లేపల్లి రోడ్) ఉదయం 10:30 గంటలకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజున జిల్లా కలెక్టర్ తో సహా జిల్లా అధికారులందరూ మండలానికి వస్తారన్నారు. ప్రజల నుండి మధ్యాహ్నం వరకు అర్జీలు స్వీకరించి అనంతరం జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించి వారి శాఖలకు సంబంధించిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు.
ఈ కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలిసేందుకు వీలుగా మండలంలో దండోరా, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయవలసినదిగా సంబంధిత మండల అధికారులకు కలెక్టర్ సూచించారు.కావున చల్లపల్లి మండలంలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.