మాతృభాష తెలుగును కాపాడుకుందాం.
-డాక్టర్ పాపినేని శివశంకర్.
ANDHRAPATRIKA మాతృభాష తెలుగును కాపాడుకుందామని,మృతభాషగా మారకుండా కృషి చేద్దామని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ పిలుపునిచ్చారు.జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న గుంటూరులోని కన్నా విద్యాసంస్థల హాలులో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాపినేని శివశంకర్ ప్రసంగిస్తూ ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని కోరారు.తెలుగు భాష గొప్పతనాన్ని గురించి,మన కవుల విశిష్టతను గూర్చి వివరించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో 7150 భాషలు కొనసాగుతున్నాయని,10 వేల మంది ప్రజలకు మించి మాట్లాడే భాషలు 121 వున్నాయని అన్నారు.బంగ్లాదేశ్ ప్రజలు బెంగాలీ భాష కోసం చేసిన పోరాట ఫలితంగా ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా అమలౌతుందన్నారు.జర్మనీ, జపాన్,చైనా,ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ మాతృభాషలోనే విద్యను కొనసాగిస్తున్నాయన్నారు.భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ బహుభాషా వాదాన్ని ప్రోత్సహించాలన్నారు.అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ కార్పోరేట్ విద్యాసంస్థలలో సంస్కృత భాష ప్రవేశపెట్టడం వలన విద్యార్థులు తెలుగు భాషను నేర్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.23 భాషల్లో ప్రపంచ ప్రజలలో సగం మంది మాట్లాడుతూ మాతృభాషను గౌరవిస్తున్నారన్నారు.కన్నా విద్యాసంస్థల వ్యవస్థాపకులు కన్నా మాస్టర్ ప్రసంగిస్తూ మాతృభాషను మరువరాదని వేమన,సుమతీ శతకాలను చదవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత,గాయకులు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ మధుర గీతాలను ఆలపించారు.