మచిలీపట్నం, నవంబర్ 27, ఆంధ్రపత్రిక.
నవంబర్ 30వ తేదీన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్లో సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈ నెల 30 వ తేదీన మచిలీపట్నం మండలం మేకవానిపాలెం గ్రామంలో జరిగే గ్రామసభలో గౌరవ రాష్ట్ర గవర్నర్ పాల్గొంటారన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమాన్, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం ఆవాస యోజన, పిఎం విశ్వకర్మ, పీఎం పోషణ్ అభియాన్ వంటి 17 సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, వారికి అందిన ఆర్థిక సహాయం తదితర వివరాలు మండలాల వారీగా సంబంధిత జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం నేరుగా కొన్నింటిని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరికొన్నింటిని ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ పేరును తెలియచేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర గవర్నర్ పథకాల లబ్ధిదారులతో కాసేపు ముఖాముఖి మాట్లాడుతారన్నారు. వారి అభిప్రాయాలను, విజయగాధలను అడిగి తెలుసుకుంటారని, అందుకు తగ్గ ఏర్పాట్లు అందుకు తగ్గ ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు.లబ్ధిదారులను గుర్తించి వారితో మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు.
గౌ.రాష్ట్ర గవర్నర్ విజయవాడ నుండి మచిలీపట్నం వచ్చే జాతీయ రహదారి మార్గంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ చెత్తాచెదారాలు కనిపించరాదని వాటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, ముళ్ళ చెట్లు తొలగించాలని, పారిశుధ్యం సజావుగా ఉండాలని సూచిస్తూ ఇందుకోసం సంబంధిత ఉయ్యూరు ఆర్డిఓ, మునిసిపల్, పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పెద్ది రోజా, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మూడావిసి రాజ్యలక్ష్మి, జడ్పీ సీఈవో వి జ్యోతిబసు, డీఈవో తాహెరా సుల్తానా, డి ఆర్ డి ఏ పి డి పిఎస్ఆర్ ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.