నటుడు విజయ్ దేవరకొండ
నవంబర్ 09 (ఆంధ్రపత్రిక): విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ప్లాప్‌పై తాజాగా విజయ్ స్పందించారు. లైగర్ పరాజయంతో పాటు, భవిష్యత్తు ప్రణాళికలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ చిత్రం ప్లాప్ కారణంగా విరామం తీసుకునే ఆలోచన తనకు లేదని అన్నారు. లైగర్ సినిమాతో తాను ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. ఎక్కడికి వెళ్లినా తన అభిమానులు అదిరిపోయే కమ్‌బ్యాక్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుతున్నారని తెలిపారు. ’నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అభిమానులు అడిగేది ఒక్కటే. ’అన్నా నువ్వు అదిరిపోయే చిత్రంతో మళ్లీ మా ముందుకు రావాలి’ అని. వాళ్లకు నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా..? ’నేను ఎక్కడికీ వెళ్లలేదు కదా.. అని’ అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం విజయ్ ’ఖుషీ’ చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. మజిలీ ఫేం శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ , రోహిణి, లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ`సమంత కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు, మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి.