ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గోల్తండాకు చెందిన బానోత్ గంగ, బీకూకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం భర్తను వదిలేసిన గంగ ఖమ్మం వచ్చి వినోద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. చర్చి కౌంపౌండ్ వద్ద పిల్లలు శ్రీవల్లి(12) చరణ్‌తో ఉంటూ వైన్స్ వద్ద జొన్నరొట్టెలు అమ్ముకుంటూ జీవిస్తుండగా.. శ్రీవల్లి ఆరో తరగతి చదువుతోంది.
సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం
గంగ ఉదయమే రోజు మాదిరిగానే సోమవారం ఉదయం ఇళ్లలో పనికి వెళ్లింది. అనంతరం కింద అంతస్తులో ఉండే మహిళ గంగ ఇంటికి వెళ్లగా ఫ్యాన్‌కు వేలాడుతూ శ్రీవల్లి కనిపించింది. దీంతో ఆమె కేకలు వేయగా చుట్టుపక్కల వారు చేరుకుని కిందకు దించి గంగకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్న శ్రీవల్లికి స్థానిక హోంగార్డ్ రవి సీపీఆర్ చేయగా కొంతవరకు ఊపిరి ఆడినట్లు తెలిసినా.. జిల్లా ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
తల్లి ప్రియుడిపై అనుమానం
శ్రీవల్లి మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి బీకూ, బంధువులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని గంగపై దాడి చేశారు. తన ప్రియుడు వినోద్‌తో కలిసి ఆమే శ్రీవల్లికి ఉరి వేసిందని ఆరోపించారు. మొదట ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన గంగ కాసేపటికి వినోద్ ఉన్నాడని చెప్పడంతో మరింత మండిపడ్డారు. తమ సహజీవనానికి అడ్డు వస్తుందని శ్రీవల్లిని అడ్డు తొలగించేందుకు గంగ, ఆమె ప్రియుడు పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపించారు. గంగ కుమారుడు చరణ్‌ను కూడా వినోద్ తీవ్రంగా కొడుతుండడంతో నెల క్రితం గోల్తండాలోకి తండ్రి వద్దకు వెళ్లాడు. కాగా, గంగ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న లెటర్లో ‘నాకు బతకాలని లేదు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసినట్లు తెలు స్తుండగా శ్రీవల్లిని కొట్టి బలవంతంగా రాయించారా, లేక వినోద్ రాశాడా అనేది తెలియరాలేదు. శ్రీవల్లి స్థానికులతో మంచిగా ఉండేదని, టీవీలో చూసి భరతనాట్యం నేర్చుకున్న ఆమె చిన్నారులకు నేర్పించేదని చెబుతున్నారు. ఆమె మృతి చెందినట్లు తెలియగానే వినోద్ కనిపించకుండా పోవడంతో శ్రీవల్లి తండ్రి బీకూ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామి తెలిపారు. అయితే, గంగ, ఆమె ప్రియుడు వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.