టెక్ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్ దిగ్గజం ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో…
టెక్ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్ దిగ్గజం ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా భారత్‌లోనూ కీలక పదవుల్లో ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇటీవలి రౌండ్లో మెటా రిట్రెంచ్‌మెంట్‌లో భారత్ నుంచి చాలా మంది పేర్లను జాబితాలో చేర్చింది.
ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, డైరెక్టర్, మీడియా పార్టనర్షిప్ హెడ్ సాకేత్ ఝా సౌరభ్‌లను మెటా తొలగించింది. ఈ రౌండ్ తొలగింపులలో మార్కెటింగ్, సైట్ భద్రత, ఎంటర్ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్లో పనిచేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు కోల్పోయిన వారు లింక్డిన్లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మెటా ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు.. గతేడాది నవంబర్‌లో కూడా ఏకంగా 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత కొన్ని రోజులుగా మెటా ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, డిజిటల్ ప్రకటనల తగ్గింపు కారణంగా కంపెనీపై భారం పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల తొలగింపు తప్పడంలేదు. అదేవిధంగా తన ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్లేందుకు ప్రయత్నిస్తోంది.