మంత్రి ధర్మాన ప్రసాదరావు
విజయవాడ,అక్టోబర్ 21 (ఆంధ్రపత్రిక):కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరమని, సమాజం హితం కోరే ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలో మంత్రి ధర్మాన అధ్యక్షతన అసైన్డ్ భూములపై కమిటీ తొలి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు (రాజాం), కైలే అనిల్ కుమార్ (పామర్రు), టీజేఆర్ సుధాకర్ బాబు (సంతనూతలపాడు), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), జొన్నగడ్డ పద్మావతి (సింగనమల), కె. భాగ్యలక్ష్మి (పాడేరు) హాజరయ్యారు. అసైన్డ్ భూములపై అన్యాక్రాంతమైన హక్కుల బదలాయింపుపై ఈ కమిటీ సమీక్షించింది. ఈ సంద్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అసైన్డ్ భూములపై ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. సమాజం హితవు కోరే శాసన సభ లేదా ప్రభుత్వం చట్టాలను కాలానుగుణంగా సమీక్షించుకొనుచు, తదనుగుణంగా మార్పులు, చేర్పులూ చేస్తుండాలని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరు విడతల భూ పంపిణికీ తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నారని కొనియాడారు. గురువారం (20వ తేదిన) కృష్ణా జిల్లా, అవనిగడ్డలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తితో భూమి అన్నది ప్రజలకు మరింత అందుబాటులో ఉండవలెనన్న ఆదేశ సూత్రాలకు అనుగుణంగా, పేదలకు మేలు జరిగేలా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నారు. భూమి వ్యవసాయంకు, ఇతర రంగాలకు ఉపయుక్తం అయ్యే విధంగా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మ విశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి కలిగించేలా కమిటీ కృషి చేయాలని కోరారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో ఉన్న పెత్తందారులు పేద వర్గాల వారి నుండి భూముల లాక్కుకునేందుకు వీల్లేదన్నారు. ప్రభుత్వం అసైన్మెంట్ దారులైన పేద తరగతుల వారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే విధంగా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని.. ఇదే ముఖ్యమంత్రి నిర్ణయం కూడా అని తెలిపారు. ప్రభుత్వానికీ మంచి పేరు వచ్చే విధంగా అభిప్రాయాలు తీసుకుని, తరువాత తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలేంటి..? అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ కమిటీ చేస్తున్న సూచనలు, సలహాలు ఏమిటి.? అని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడానికి కమిటీ, అధికారుల బృందం పర్యటించాలని మంత్రి ధర్మాన తెలిపారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి భూమికి రక్షణ కల్పించి, భద్రతతో పాటు ప్రతి పేదవాడికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే లక్ష్యంతో అసైన్డ్ భూముల సమస్యలపై చర్చించడానికి గౌరవ ముఖ్యమంత్రి ఈ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి పేదవాడికి మేలు జరిగేలా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నందున వీటిని గుర్తించి తర్వాత ఇంటి నివేశన పట్టా మంజూరుకు చర్యలు చేపడుతున్నప్పుడు భూ ఆసాములు కొంతమంది కోర్టులలో వ్యాజ్యములు వేస్తున్నారని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. పోడు భూములు శక్తి మేరకు సాగుచేస్తున్నందున ఎక్కువ మంది లబ్ధిపొందేలా పట్టాలు మంజూరుచేయమని మంత్రి తానేటి వనిత సూచించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎక్కువ మేలు జరిగాలని, అదే ముఖ్యమంత్రి గారికి ఆనందమని తెలిపారు. కమిటీలో ఎక్కువ మంది సభ్యులు గతంలో ఎస్సీ, ఎస్టీ భూములపై పోరాడిన వాళ్లే ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నియమించడం గొప్ప పరిణామమన్నారు. అసైన్డ్ భూములపై ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నారో అధ్యయనం చేయడానికి కమిటీ పర్యటించాలని ఆయన కోరారు. అనాదిగా అసైన్మెంట్ కి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి..? ఎంత మేరకు భూమి పేదల వద్ద ఉన్నాయి..? వాటి పరిరక్షణ మరియు ఆర్థిక స్వావలంబన చేకూర్చుటకు కమిటీ చైర్మన్ వారికి తోడ్పాటు అందిస్తూ ముఖ్యమంత్రి వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ సమీక్ష ప్రారంభంలో, భూపరిపాలన మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (భూములు) శాఖ ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ రెవెన్యూ మంత్రి, కమిటీ ఛైర్మన్ మరియు ఇతర సభ్యులను స్వాగతించారు. ‘అసైన్డ్ భూములపై బదలాయింపు హక్కులను కల్పించడం’ కోసం కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి వివరించారు. అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీఎల్ఏ %డ% సెక్రటరీ ఎ.ఎండీ. ఇంతియాజ్, ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి. గణేష్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.