న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ జట్టు తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినట్లు ప్రకటించాడు.
గత రెండు రోజులుగా ఎన్నో భావోద్వేగాలు తనను చుట్టుముట్టాయని..
ఈ అనుభూతి కొత్తగా ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా తన చివరి మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించానని బౌల్ట్ సంతోషం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్ చెత్త ప్రదర్శన
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో భాగంగా పపువా న్యూగినియాతో మ్యాచ్ అనంతరం బౌల్ట్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్‌గా బౌల్ట్ పదమూడేళ్ల ప్రయాణానికి తెరపడినట్లయింది.
కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. గ్రూప్-సిలో ఉన్న కివీస్ జట్టు.. తొలి రెండు మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది.
ఫలితంగా సూపర్-8 నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్.. అనంతరం ఉగాండా.. తాజాగా పపువా న్యూగినియాపై గెలుపొంది టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై విజయం తర్వాత బౌల్ట్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి సంకేతాలు ఇచ్చాడు. అయితే, కేవలం అంతర్జాతీయ టీ20లకు మాత్రమే అతడు గుడ్‌బై చెప్పాడా అనే చర్చ నడుస్తోంది.
టెస్టుల్లో దుమ్ము లేపి
2011లో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ట్రెంట్ బౌల్ట్. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున 78 టెస్టులాడి ఏకంగా 317 వికెట్లు కూల్చాడు.
ఇక 114 వన్డేల్లో 211 వికెట్లు తీసిన బౌల్ట్.. 61 టీ20లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. అయితే, బౌల్ట్ రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ క్రికెట్లో ఆడే క్రమంలో అంతర్జాతీయ విధులకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో తిరిగి కివీస్ జట్టుతో కలిసి బౌల్ట్.. నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా తొమ్మిది వికెట్లు తీశాడు.
ఇక బౌల్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ఇప్పట్లో తాను తన టీ20 కెరీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.