నరేంద్ర మోదీ భారతదేశానికి ఇప్పటికే రెండుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మరోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారు.
ఈసారి 400 స్థానాలలో నెగ్గి భారీ విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా మోదీ లోక్‌సభ ఎలక్షన్ల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలలో ప్రచారాలు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొల్లాపూర్‌లో, ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు ఇసుకేస్తే రాలనంతమంది జనం వచ్చినట్లు ఒక ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి సపోర్ట్‌గా ఒక ఫోటో కూడా షేర్ చేస్తున్నారు. అందులో కనిపిస్తున్న ప్రజలందరూ మోదీ రోడ్ షోకు హాజరైన వారే అంటూ క్లెయిమ్ చేస్తున్నారు.
(The Quint టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)
* అంతమంది వచ్చారా?
ఈ ఫోటో వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సైట్స్లోనూ వైరల్‌గా మారింది. ఇందులో వీధుల్లో గుమిగూడిన భారీ జనసమూహాన్ని చూడవచ్చు. తెలంగాణలో మోదీ రోడ్ షో కోసం ఇంతమంది జనం ఎప్పుడు పోటెత్తారు? అనే సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. దీంతో ‘ది క్వింట్’ (The Quint) వాట్సాప్ టిప్‌లైన్‌కు ఈ వైరల్ ఫోటో ను పంపించి దాని గురించి మరింత సమాచారం ఇవ్వగలరా? అని ఒకరు ప్రశ్నించారు. దీంతో ఈ వైరల్ పిక్చర్ గురించి ‘ది క్వింట్’ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేసింది.
(Source: Facebook/Screenshot)
* గతంలోనూ వైరల్
ది క్వింట్ దర్యాప్తులో ఈ ఫోటో ను వేరే డిస్క్రిప్షన్ లేదా క్యాప్షన్‌తో గతంలో కూడా వైరల్ చేశారని తేలింది. “గుజరాత్ ప్రజలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు.” అంటూ ఇదే ఫోటో ను గతంలో వాడినట్లు తెలిసింది.
(Source: X (formerly Twitter)/Screenshot)
ఇంకా దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ ఇమేజ్ తెలంగాణ ప్రజలకు లేదంటే గుజరాత్ ప్రజలకు చెందిందని కాదనే నిజం బయటపడింది. అసలు ఈ చిత్రం ఇప్పటిది కానే కాదు. 2008, మే నెల నాటిది. అంటే దాదాపు 16 ఏళ్ల క్రితం నాటి పిక్చర్ ఇది.
ది క్వింట్ టీమ్ గూగుల్ లెన్స్ (Google Lens) అప్లికేషన్ ఉపయోగించి ఈ వైరల్ పిక్‌ను ‘Flickr’పేరుతో ఉన్న ఒక ఆన్లైన్ వెబ్సైట్లో కనిపెట్టింది. ఫ్లికర్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఆ చిత్రానికి “అద్భుతమైన జన సమూహం… ఈ ప్రజలు ఒలింపిక్ టార్చ్ పాసింగ్ చూడటానికి గుమిగూడారు. అదే కాలంలో సుమారు 500 మైళ్ల దూరాన ఉన్న సిచువాన్‌లో భూకంపం సంభవించింది. ప్రజలు భూకంప బాధితులకు సంతాపం కూడా తెలియజేస్తున్నారు.” అని క్యాప్షన్ ఉంది.
(Source: Flickr/Screenshot)
దీని ద్వారా ఈ ఫోటో 2008, మే నెలలో, చైనాలోని గ్వాంగ్జౌ (Guangzhou) నగరంలో జరిగిన సంఘటనకు సంబంధించినదిగా తేలింది. ఆ సమయంలో ఈ నగరం నుంచి ఒలింపిక్ టార్చ్ పాసింగ్ సాగింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి, ఒలింపిక్ టార్చ్‌ను చూస్తూ ఎంజాయ్ చేశారు.
* 2008 చైనా ఒలింపిక్స్ గురించి కథనం
2008లో చైనాలో జరిగిన ఒలింపిక్ క్రీడల గురించి “ది అట్లాంటిక్” అనే పత్రికలో ఒక స్టోరీ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ ద్వారా ఆ ఫోటో చైనాలోని నగరం ప్రజలకు సంబంధించినదే అని ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఒక నిర్ధారణకు వచ్చింది. ఒక నగరం నుంచి మరొక నగరానికి సాగిన ఒలింపిక్ టార్చర్ గురించి విస్తృతంగా కవరేజీ లభించినట్లు కథనంలో తెలిపింది.