హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) మంగళవారం నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan) కేటీఆర్ వస్తారు.
9:30 గంటలకు అంబర్ పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్ లంక (తులసి రామ్ నగర్) ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలవనున్నారు. కేటీఆర్‌తో పాటు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర నేతలు పాల్గొననున్నారు.
కాగా పేద ప్రజల ఇళ్లు కూల్చే అధికారం రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఇందిరమ్మ, సోనియమ్మ చెప్పిందా? అని నిలదీశారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు రూ.25 వేల కోట్లు పంపేందుకే రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతోందని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్లు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌తోపాటు సూర్యాపేట, ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఎవరికోసం హైడ్రా తీసుకొచ్చారని సర్కారును నిలదీశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యమంటున్న రేవంత్‌రెడ్డి ఎఫ్టీఎల్లో ఉందని చెబుతూ.. సెక్రటేరియట్‌ను కూడా కూలుస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.
చట్టప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్‌కు చెప్పిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎఫ్టీఎల్లో ఉన్న ఆయన సోదరుడి ఇల్లు కూలగొట్టాలని డిమాండ్ చేశారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదు? ఎఫ్టీఎల్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని నిలదీశారు. మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎవరి కమీషన్ల కోసం దీన్ని చేపట్టారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. 1920 నుంచి 2020 వరకు మూసీలో ఎలాంటి సమస్య రాలేదని, 2020లో అతి భారీ వర్షాలతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. 2400 కిలోమీటర్ల పొడవైన గంగా నది ప్రక్షాళనకు రూ.40 వేల కోట్లు, సబర్మతి రివర్ ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చయితే.. 55 కి.మీ. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెట్టడం కుంభకోణం కాక మరేంటని కేటీఆర్ నిలదీశారు. పేదల ఇళ్లను కూల్చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. బుల్డోజర్లకు బీఆర్ఎస్ నేతలు అడ్డంగా ఉంటారని హెచ్చరించారు.
ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణ చెబుతారా?
అధికారం చేపట్టిన వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు సమర్పించారని.. 300 రోజులు దాటినా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయనేలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చిన రాహుల్, ప్రియాంక ఢిల్లీ నుంచి వచ్చి ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం హైదర్‌గూడ, కిషన్‌బాగ్‌లో వివిధ కాలనీలకు చెందిన మూసీ బాధితుల వెతలను కేటీఆర్ తెలుసుకున్నారు. 30, 40 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నామని, ఉన్నపళంగా వెళ్లిపోవాలంటే ఎలా? అని విలపించారు.