Kota: విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఎఫెక్ట్.. కోటాలో కొత్త రకం ఫ్యాన్లు..!

ANDHRAPATRIKA కోటా: వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్ల (Coaching Centers)కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ (Rajasthan)లోని ‘కోటా (Kota)’లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Suicides) కలవరపెడుతున్నాయి.
దీంతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్ (పీజీ) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు.
ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు కోటాకు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. అయితే, గత కొద్ది రోజులుగా ఇక్కడ తరచూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ క్రమంలోనే కోటా (Kota) జిల్లా యంత్రాంగం గతవారం సమావేశం నిర్వహించింది. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. మృతి చెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫ్యాన్‌కు ఉరేసుకునే మరణించినట్లు గుర్తించిన అధికారులు.. హాస్టళ్లు, పీజీ గదుల్లో తక్షణమే వాటిని తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లోడ్‌ను గుర్తించిన క్షణంలోనే అన్కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారుచేశారు. అంటే.. లోడ్ గుర్తించగా ఫ్యాన్ సీలింగ్ నుంచి విడిపోయి కిందకు వేలాడుతుంది. ప్రస్తుతం కోటాలోని హాస్టళ్లలో ఈ ఫ్యాన్లను శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక, దీంతో పాటు కోచింగ్ సంస్థలు కచ్చితంగా విద్యార్థులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. అంతేగాక, ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను పాటించని హాస్టళ్లు, పీసీ వసతులను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. చదువులో ఒత్తిడి కారణంగా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
అయితే, ఫ్యాన్లను మార్చడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలంటే మార్చాల్సింది ఫ్యాన్లు కాదని, వారి ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని సూచిస్తున్నారు.