కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పన కోసం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. అదే 2024 బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన ఇంటర్న్ షిప్ పథకం.
ఈ పథకం ద్వారా ప్రతినెలా రూ.5000 వరకు యువతకు ఇంటర్న్ షిప్ అందచేయడం, అలాగే కంపనీలకు, నిరుద్యోగ యువతకు మధ్య అనుసంధాన వ్యనస్థను ఏర్పరచడంతో పాటు వారిలో నైపుణ్యాలను పెంపొందించి సులభంగా ఉద్యోగం పొందేలా సహాయపడటం. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. యువత కోసం ఈ పథకం కింద కొత్త పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తారు. ఈ పథకం ప్రయోజనాల కోసం ఇంటర్న్ వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే అతని కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ప్రస్తుతం.. అధికారిక డిగ్రీ కోర్సు లేదా ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఈ ఇంటర్న్ షిప్ పథకంలో భాగం కాలేరు. అభ్యర్థులు ఆన్ లైన్ కోర్సులు లేదా వృత్తి శిక్షణలో చేరవచ్చు.
ప్రతి ఇంటర్న్ కు ప్రతినెలా అందించే రూ.5,000 లను కంపెనీల సీఎస్ఆర్ ఫండ్ నుంచి రూ.500, ప్రభుత్వం రూ.4,500 అందజేస్తారు. కార్పొరేట్ కంపనీల ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ఈ పథకం సహాయకరంగా ఉంటుంది. ఇంటర్న్ షిప్ పథకం కింద శిక్షణకు అయ్యే ఖర్చులను కంపెనీలు భరిస్తాయి. అయితే అక్కడ ఉండేందుకు, భోజనానికి అయ్యే ఖర్చులను యువతనే భరించాల్సి ఉంటుంది. కానీ ఆ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చే సాయంతో భర్తీ అవుతాయి.