బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ స్కామ్ చేసిన కవిత
మండిపడ్డ వైటిపి అధ్యక్షురాలు షర్మిల
హైదరాబాద్,డిసెంబర్ 6 (ఆంధ్రపత్రిక): తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని వైటిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. కే అంటే కొట్టి..సీ అంటే చంపే..ఆర్ అంటే రాజ్యాంగం అని చురకలంటించారు. ఎస్సీలకు అన్యాయం జరు గుతోందని ఆమె ఆరోపించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పెడితే కేసీఆర్ తీసేశారని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్..మాట తప్పారన్నారు. పదిశాతం మందికి కూడా దళితబంధు పథకం ఇవ్వలేదన్నారు.రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ అంబేద్కర్?ను అవమానించారన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదని షర్మిల అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరి స్తున్నారని చెప్పారు. ఈ నియంత పాలన పోయి..ప్రజల ప్రభుత్వం రావాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజల కోసం కోట్లాడే ప్రజలు ఉండొద్దు అని కేసీఆర్ రాజ్యాంగంలో ఉందన్నారు. ప్రజల కోసం నిలబడే వాళ్ళని నల్లిని నలిపినట్టు నలిపేయాలని కేసీఆర్ రాజ్యాంగంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమాన పర్చాలి…. పెట్రోల్ బాంబులతో దాడి చేయాలని కేసీఆర్ రాజ్యాంగంలో రాసి ఉందని ఆరోపించారు. పోలీసులను తమ సొంత పార్టీ మనుషుల్లాగా వాడుకోవాలని కేసీఆర్ రాజ్యాంగంలో రాసి ఉందన్నారు. ప్రజల కోసం సచ్చిపోవడానికి వెనుకాడని నాయకులు తెలంగాణలో రావాలన్నారు. మంత్రి హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఆయనవి బోగస్ మాటలని కొట్టిపారేశారు. ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి అగ్గిపెట్టె తెచ్చుకుని తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుని తెలంగాణ కోసం అమరుడయ్యారని గుర్తు చేశారు. కానీ మంత్రి హరీష్ రావు అగ్గిపెట్టె మర్చిపోయి..మంత్రి అయ్యారని చెప్పారు. ఈ విషయంపై సోషల్ విూడియాలో ట్రోల్ అవుతోందన్నారు.రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసమే ఉచిత విద్యుత్ పథకంపై సంతకం పెట్టారని చెప్పారు. కవితమ్మ అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే..లిక్కర్ స్కాంకు తెరలేపిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. తన అరెస్ట్ పట్ల సానూభూతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.