తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు.
శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్ పరిభాషలో ‘మొబిలైజేషన్ స్టార్ట్’ అంటారని వివరించారు. కేసీఆర్‌కు ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.
అసదుద్దీన్, అఖిలేశ్‌యాదవ్ పరామర్శ
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యశోద హాస్పిటల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని, వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, వేగంగా కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉన్నది. అల్లా దయతో ఆయన త్వరలోనే మళ్లీ రంగంలోకి దిగుతారని ఆశిస్తున్నాను’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ ఆరా తీశారు. కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి కూడా పరామర్శించారు. ఆయన వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు: రామోజీరావు
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు ప్రత్యేకంగా కేటీఆర్‌కు లేఖ రాశారు. ‘నాన్నగారు ప్రమాదవశాత్తూ జారిపడి క్షతగాత్రులయ్యారని తెలిసి నాకు కలిగిన బాధను మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. తుంటి మార్పిడి కోసం ఆయనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందన్న వార్త ముదావహం. తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదురొని సాఫల్యం పొందిన కేసీఆర్.. ఈ సవాలును అవలీలగా అధిగమిస్తారని, కొన్ని వారాల విశ్రాంతి అనివార్యమైనా అనతికాలంలోనే కోలుకొని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.