అఫ్గానిస్థాన్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్‌కు చేరింది. ప్రపంచకప్ చరిత్రలో సెమీస్‌కు అర్హత సాధించడం అఫ్గాన్‌కు ఇదే తొలిసారి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి బంగ్లాదేశ్‌ను ఓడించి ఈ ఘనత అందుకుంది.
వర్షం కారణంగా బంగ్లా ఛేదనను 19 ఓవర్లకు కుదించిన ఈ పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ కమర్షియల్ సినిమాను తలపించింది. ఫైట్, కామెడీ, ట్విస్ట్, ఎమోషన్‌తో అభిమానులను హోరెత్తించింది. ఒత్తిడిలో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు చేసిన ఈ పనులకు కామెంటరీ బాక్స్‌లో ఉన్న వ్యాఖ్యాతలు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అఫ్గాన్ బ్యాటింగ్ సమయంలో రెండు సంఘటనలు, బౌలింగ్ టైమ్‌లో ఓ ఇన్నిండెట్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
సాధారణంగా స్ట్రైకర్, నాన్‌స్ట్రైకర్ వ్యతిరేక దిశలో మరో ఎండ్‌కు చేరుకుంటే సింగిల్ వస్తుంది. కానీ వారిద్దరు ఒకే వైపు రన్నింగ్ రేసులో పరిగెత్తడం ఎప్పుడైనా చూశారా? అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో అది చోటు చేసుకుంది. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్లో గుర్బాజ్ సింగిల్‌కు తొలుత ప్రయత్నించాడు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న గుల్బాదిన్ నైబ్ పరుగు అందుకున్నాడు. అతడు క్రీజుకు చేరుకునేలోపు గుర్బాజ్ సింగిల్‌కు నిరాకరించాడు. ఇద్దరూ పోటాపోటీగా వికెట్ కీపర్ వైపు వెళ్లారు. కానీ బంగ్లా ప్లేయర్ వేసిన త్రో మిస్ అయ్యింది.
దీంతో తిరిగి అంపైర్ దిశగా ఇద్దరూ రన్నింగ్ రేసు పెట్టుకున్నారు. అలా వెళ్తే ఔటవుతామని భావించి పిచ్ మధ్యలో ఇద్దరూ ఆగిపోయారు. మొత్తంగా గుర్జాబ్ అవతల ఎండ్‌కు వెళ్లడంతో సింగిల్ వచ్చింది. ఇదంతా జరుగుతున్న బంగ్లా ఫీల్డర్లు చోద్యం చూడటం గమనార్హం. ఇక ఆఖరి ఓవర్లో డబుల్స్‌కు నిరాకరించాడని రషీద్ ఖాన్.. తన పార్టనర్ కరీమ్ జనత్వైపు కోపంగా బ్యాటు విసిరాడు. జట్టుకు స్కోరు అందించాలనే తొందరలో ఆవేశంగా రషీద్ ప్రవర్తించాడు.
ఇక బంగ్లా ఛేజింగ్ సమయంలో.. అఫ్గానిస్థాన్ కోచ్ జొనాతన్ ట్రోట్ ఇచ్చిన సూచనలతో గుల్బాదిన్ నైబ్ అకస్మాతుగా కిందపడిపోయాడు. కండరాలు పట్టేశాయని నటించాడు. మ్యాచ్‌ను స్లో చేస్తే తమకు కలిసొస్తుందని అఫ్గాన్ కోచ్ చెప్పడంతో నైబ్ యాక్టింగ్ మొదలుపెట్టాడు. దీంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయి, అఫ్గాన్‌కు ఫేవరేట్‌గా మారింది.అయితే నైబ్ కాసేపటికే నొప్పి తగ్గిపోయిందని వచ్చి రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం.దీంతో అతనికి ఆస్కార్ ఇవ్వొచ్చని వ్యాఖ్యాతలు సరదాగా పేర్కొన్నారు. మొత్తంగా బంగ్లాపై గెలిచి సెమీస్‌కు వెళ్లడంతో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు ఎమోషనల్ అయ్యారు.