- బెలారస్ మానవహక్కుల కార్యకర్త అలెస్ బైలియాట్ స్కీ
- రష్యా, ఉక్రెయిన్ శాంతి సంఘాల ఎంపిక
స్టాక్ హోం,అక్టోబర్ 7 (ఆంధ్రపత్రిక): ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతి 2022ని బహుమతి బెలారస్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త, లాయర్, అలెస్ బైలియాట్ స్కీ తో పాటు రష్యా, ఉక్రెయిన్ మానవహక్కులకు సంఘాలకు లభించింది. ఉక్రెయిన్`రష్యా మధ్య భీకర యుద్దం జరుగుతున్న సమయంలో శాంతికి కృషి చేస్తున్న వాళ్లకు ఈ బహుమతిని ప్రకటించా రు. నోబెల్ శాంతి బహుమతి కోసం 343 మంది పోటీ పడ్డారు. కాని మానవహక్కుల సంఘాలకు ఈసారి బహుమతిని ప్రకటించారు. బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీతోపాటు.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ రష్యా, మెమోరియల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉక్రెయిన్, సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ (సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్) లకు 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్‌కు ఎంపిక చేశారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఆయా దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలపై ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, అదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి బహూకరించనున్నట్లు ఈ సందర్భంగా నోబెల్ కమిటీ వివరించింది. ఈ శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నియంత్రించేందుకు కృషిచేశారని కమిటీ తెలిపింది. నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వాల అరాచకాలను ప్రశ్నించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడం కోసం పాటుపడ్డారని పేర్కొంది.మానవ హక్కుల న్యాయవాది అలెస్ బిలియాట్స్కీ, రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ 2022 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నాయి.