
Jagan Vs TDP: జగన్ ను ఇప్పుడెందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?
Jagan Vs TDP: మొదట్లో జగన్ ను కంట్రోల్ చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు తటపటాయిస్తున్నాయి. టీడీపీ నేతల ఎటాక్ కు కౌంటర్ ఎటాక్ లు ఇవ్వడంలోనూ సక్సెస్ అవుతున్నారు.
రచ్చకెక్కిన ఎన్నో విషయాలను పరిష్కరించుకోగలిగారు. పాలనపై పూర్తి పట్టు సాధించిన ఆయనను ఇంటా బయట ఎలా ఎదుర్కోవాలన్న మీమాంసలో టీడీపీ నేతలను పడవేశారు. వైసీపీని అప్రదిష్టపాలు చేసే వ్యూహాలన్నింటికీ పటాపంచలు చేస్తున్న జగన్ ను ఎదుర్కోవడం గతం కంటే ఇప్పుడు కష్టంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లి విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు జగన్ దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి రావాలని సవాల్ విసిరారు. మొత్తం 175 స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని ప్రకటించి రాజకీయ వ్యూహానికి తెరలెపారు. వాస్తవానికి ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంది. ప్రతి అంశాన్ని ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ విసిరిన సవాల్ పైనే చర్చ జరిగేలా చేయడంలో మైండ్ గేమ్ లేకపోలేదు. గతంలో జరిగిన బహిరంగ సభల్లోనూ ‘నన్నేం పీకలేరు అంటూ’ వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ తరహా స్పీచ్ లతో పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి రాకముందే జగన్ పై సీబీఐ కేసులు ఉన్నాయి. ఆర్థిక ఆరోపణలతో జైలుకు వెళ్లివచ్చారు. దానిని సానుభూతిగా మలుచుకున్న ఆయన 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత నుంచి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ, పాలనను గాలికి వదిలేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో నవరత్నాలపై దృష్టి పెట్టి సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తూనే, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేయయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అధికార పక్షం ఒక్కటే ఉండాలని భావిస్తూ ఏకపక్షంగా వ్యవహరించి చేసిన కొన్ని తప్పులు టీడీపీ, జనసేలను మరింత బలపడేలా చేశాయి.
Jagan Vs TDP
అటు కేంద్రంలో విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతున్నారు. బీజేపీ నేతలు పూర్తిగా వైసీపీకి సహకరిస్తున్నారు. ఇటు టీడీపీ వ్యూహాలను పటాపంచలు చేసేందుకు సుశిక్షితులైన అధికారులను నియమించుకొని ఎటాక్ మొదలుపెట్టారు. మొత్తానికి జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కని విధంగా మారిపోయాయి. అయితే, జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆయన జిత్తులను ప్రజలను నమ్మే స్థితిలో లేరని టీడీపీ నేతలు అంటున్నాయి. ఏది ఏమైనా ప్రతిపక్షాల వ్యూహాలు గతంలోలా జగన్ పై పనిచేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.