మాట్లాడుతున్న జీవీ, మక్కెన
వినుకొండ: ఐదేళ్లయినా తేలని జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై దిల్లీలో ఆయన ధర్నా చేయాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన స్థానిక తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్లలో 22 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా దిల్లీలో ధర్నా చేయలేదన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీలను తీసుకెళ్లి మాట్లాడలేదని, అలాంటిది ఇప్పుడు దిల్లీ వెళ్లి ధర్నా చేస్తాననడం హాస్యస్పదమన్నారు. బాబాయ్ హత్య కేసు విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని కేంద్రాన్ని అడగని జగన్‌కు ఇప్పుడు దిల్లీ వెళ్లి ధర్నా చేసే హక్కు లేదన్నారు.
వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులమడం జగన్‌కే చెల్లిందన్నారు. ఏడాది క్రితం వరకూ రషీద్ జిలానీ కలిసే తిరిగిన విషయం పట్టణ వాసులందరికీ తెలుసని, వారిద్దరి మధ్య గొడవలు ఉంటే వాటిని పెంచిపోషించింది మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాదా అని ప్రశ్నించారు. జిలానీ ఇంటిపై దాడి చేసి ద్విచక్ర వాహనం తగలబెడితే కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజు ఘోరం జరిగిందన్నారు. రషీద్ హత్యకు నాటి వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
2022లో జిలానీ ఇంటిలో ద్విచక్ర వాహనాన్ని తగలబెడితే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా 2024లో తన పార్టీకి చెందిన వ్యక్తి బైక్‌ను నిప్పుపెట్టిన ఘటనను చూపిస్తూ జగన్ జనాలను ఏమార్చి మాట్లాడారని జీవీ విమర్శించారు. ఒకప్పుడు ఎస్పీగా పనిచేస్తూ వైకాపా కార్యకర్తగా పనిచేసిన రవిశంకర్‌రెడ్డి మంచోడు అని కితాబునివ్వడంలోనే ఓ శుద్ధపూస మరో శుద్ధపూసను పొగిడినట్టుందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పట్టణంలో ఈ ప్రభుత్వం రౌడీషీటర్లను ఏరివేస్తుందని హెచ్చరించారు.