Telangana: తెలంగాణలో ఐటీ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రిజనార్ధన్రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది ఐటీ అధికారుల బృందం.
తెలంగాణలో మూడో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భువనగిరి MLA పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ MLA మర్రి జనార్దన్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. బిజినెస్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. మెయిన్‌ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీలో ఉన్న మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ భాగస్వాములుగా ఉన్నారన్న అంశంపై తీగ లాగుతున్నారు. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీ పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారుల సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. నిన్న ఎమ్మెల్యేల అనుచరుల ఆందోళన నేపథ్యంలో అలర్ట్ అయ్యారు ఐటీ అధికారులు. దీంతో సోదాలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.
జేసీస్పిన్నింగ్ మిల్స్, జేసీబ్రదర్స్ హోల్డింగ్స్..మర్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ పేర్లతో జనార్ధన్‌రెడ్డికి వ్యాపారాలు ఉన్నాయనీ, ఓ పైపుల కంపెనీ కూడా ఉందని ఐటీ అధికారులు గుర్తించారు. బుధవారం రోజంతా పైళ్ళ శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు రాబట్టిన ఐటీ అధికారులు గురువారం వారి కంపెనీల్లో పనిచేసే ఆడిటర్లు, ఎకౌంటెంట్లపై ఐటీ శాఖ నజర్ పెట్టింది. గత రెండేళ్ళుగా కంపెనీకి సంబంధించిన లావాదేవీలకూ వారు చెల్లిస్తోన్న పన్నులకూ మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు ఐటీ అధికారులు.
పైళ్ళ శేఖర్ రెడ్డి భార్య కోమటిరెడ్డి వనితారెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వైష్ణవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చెందిన లావాదేవీలను పరిశీలించారు ఐటీ అధికారులు. తీర్థ గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఎమ్మెల్యే భార్య బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేసి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు లాకర్లను ఓపెన్ చేయించారు. నగదు తో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లాకర్లలో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఐటీ దాడులు ముమ్మరం చేశారు అధికారులు.