లెబనాన్ రాజధాని బేరూత్‌కు దక్షిణాన ఉన్న దహియేహ్లోని మాది ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడిలో దెబ్బతిన్న కార్లు, భవనం
లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో 492 మందికి పైగా మరణించారని, ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
గడిచిన 20 ఏళ్లలో జరిగిన ఘర్షణలలో ఇదే అత్యంత ఘోరమైనదని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడులతో వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవడానికి తమ ఇళ్లను వదిలివెళ్ళాయి.
2006 యుద్ధం తరువాత హిజ్బుల్లా నిర్మించుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగి, 1,300 స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
మరోవైపు హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోకి 200కు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు సైన్యం తెలిపింది. ఇద్దరు గాయపడినట్టు పారామెడికల్ సిబ్బంది తెలిపారు.
రెండు పక్షాలు యుద్ధానికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తుండటంతో సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
మృతుల్లో 35 మంది పిల్లలు, 58 మంది మహిళలు ఉన్నారని.. 1,645 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే మృతులలో ఎంతమంది పౌరులు, ఎంతమంది హిజ్బుల్లాకు చెందినవారు ఉన్నారనే విషయం తెలపలేదు.
ఈ దాడుల వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు.
లెబనాన్ మరో గాజాగా మారాలని కోరుకోవడం లేదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ఉద్రిక్తతలు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ నేతల సమావేశానికి ముందు ఈయూ విదేశీ వ్యవహారాల చీఫ్ జోసెప్ బోరెల్ మాట్లాడుతూ.. ఉద్రిక్తతలు పెరగడం ప్రమాదకరమని.. ఆందోళనకలిగిస్తోందని చెప్పారు.
”మనం దాదాపు పూర్తిస్థాయియుద్ధంలో ఉన్నాం” అని ఆయన అన్నారు.