ఇది కదా అద్దిరిపోయే గుడ్ న్యూస్ అంటే.. ఇకపై అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లాలంటే..
ANDHRAPATRIKA : – – ఏటా ఎన్నో కఠిన నియమ, నిష్టల మధ్య అయ్యప్ప దీక్షలు చేపట్టే లక్షలాది మంది భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త తెలిపింది. ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్లోనే ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది.
భక్తుల వినతులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దీనికి అనుగుణంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.
భద్రతా కారణాల రీత్యా విమానాల్లోకి కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించడం లేదు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళటానికి రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ఇపుడు విమానయాన శాఖ తీసుకున్న తాజా నిర్ణయం చాలామంది అయ్యప్ప భక్తులకు చక్కని ఉపశమనం కలిగిస్తుంది.
మకర జ్యోతి వరకు అవకాశం..
మండల దీక్ష చేపట్టే అయ్యప్ప భక్తులకు ఇరుముడి ఎంతో ప్రత్యేకమైనది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇన్నాళ్లూ లక్షలాది మంది భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాజా ఉత్తర్వులతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్కానింగ్ చేసిన తరువాత.. ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్లోనే ప్రయాణం చేయవచ్చని తెలిపారు. వెంటనే అమల్లోకి వచ్చే ఈ సౌలభ్యం.. మకర జ్యోతి దర్శనం ముగిసి, జనవరి 20 వరకు భక్తులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయ్యప్ప భక్తులంతా దీనిని గమనించి, తనిఖీ సమయంలో సిబ్బందికి సహకరించాలని కోరారు.