హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు, స్థలం కొనే ముందు అది చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లో ఉందా అని తప్పక తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మీరు కొనాలనుకుంటున్న ఇల్లు లేదా ప్లాట్.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందా?
ఇప్పుడు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారిని వెంటాడుతున్న ప్రశ్న ఇది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.
ఈ సందర్భంలో చెరువులు, కుంటలు, నాలాలు, వాగులకు దగ్గర్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే, అది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవడం కీలకంగా మారింది.
అంతేకాకుండా చెరువులు, కుంటలు, నాలాలకు సమీపంలో ఇల్లు, అపార్టుమెంట్లు కొనుగోలు చేస్తే వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్న సందర్భాలూ ఉన్నాయి.
అలా తనిఖీ చేసుకుంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకునేందుకు వీలవుతుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు.