Donald Trump vs Kamala Harris: గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్‌లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో..
ప్రచార తీవ్రత రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది.
అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ తప్పుకొన్న విషయం తెలిసిందే. తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. ఆయన స్థానంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారైంది. కమలా హ్యారిస్‌ను తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది డెమొక్రటిక్ పార్టీ.
రిపబ్లికన్ల తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి రేసులో నిలిచారు. ఇప్పడు వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం విమర్శలు-ప్రతి విమర్శలకు దిగుతున్నారు. తాజాగా కమల హ్యారిస్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
చికాగోలో నేషనల్ అసోయేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ ఏర్పాటు చేసిన ఓ కన్వెన్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో ముఖాముఖి మాట్లాడారు. సుమారు వెయ్యిమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. ఈ క్రమంలో కమలా హ్యారిస్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి.
కమలా హ్యారిస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది అర్థం కావట్లేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలం వరకు ఆమె స్వదేశంలో భారతీయతను ప్రోత్సహించేలా వ్యవహరించారని, ఇప్పుడు నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోన్నారని చెప్పారు. భారతీయులన్నా, నల్ల జాతీయులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని ట్రంప్ అన్నారు.
కమలా హ్యారిస్ జన్మతః భారతీయురాలే అయినా దేశంలో ఉన్న పరిస్థితులను సొమ్ము చేసుకునేలా ఇప్పటికిప్పుడు నల్ల జాతీయురాలిలాగా వ్యవహరించడం మొదలు పెట్టారని ట్రంప్ చెప్పారు. నల్లజాతీయుల ఓట్లను ఆకర్షించడానికే ఆమె ఆ ముద్రను పొందే ప్రయత్నం చేస్తోన్నారంటూ పరోక్షంగా ఆరోపించారు.
కమలా హ్యారిస్ తల్లి పేరు శ్యామల గోపాలన్. ఆమె స్వస్థలం తమిళనాడులోని తులసేంద్రపురం. తండ్రి డొనాల్డ్ జే హ్యారిస్‌ది జమైకా. శ్యామలా గోపాలన్ 65 సంవత్సరాల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు తరలి వెళ్లారు. ఓక్లాండోలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో చదువుకున్నారు. డాక్టరేట్ పొందారు. జమైకాకు చెందిన ఎకనమిస్ట్ డొనాల్డ్ హ్యారిస్‌ను పెళ్లాడారు.