హైదరాబాద్: వయోవృద్ధులు అంటే చిన్న పిల్లలతో సమానం. చిన్న పిల్లలను చూసుకున్నట్టే వారినీ చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసువారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతోంది.
ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా.. అది ప్రాక్టికల్‌గా సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ వేరే ప్రాంతాలు, దేశాల్లో ఉండేవారు.. ఇంట్లోనే ఉన్నా పొద్దస్తమానం పనుల ఒత్తిడితోనే సతమతం అయ్యేవారు.. పెద్దవారి ఆరోగ్యం, ఆలనాపాలనా చూసుకోవడానికి ‘టెక్నాలజీ’సాయం చేస్తోంది.
వృద్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే స్మార్ట్ వాచీలు, పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. రక్తపోటు, గుండె వేగం, షుగర్ లెవల్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు గమనించి.. ‘మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ల సాయంతో ఆరోగ్యాన్ని విశ్లేషించి హెచ్చరించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే.. చికిత్స అందించేందుకు, పెద్దలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చేందుకు వీలు ఏర్పడుతోంది. పెద్దల కోసం ‘అన్వయ’!..: హైదరాబాద్ కేంద్రంగా ‘అన్వయ కిన్ కేర్ టెక్నాలజీ’వృద్ధులకు అవసరమైన సేవలు అందిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులను స్మార్ట్ వాచ్ సాయంతో గమనిస్తూ ఉండవచ్చు. అందులో ప్రత్యేక యాప్ పెద్దల ఆరోగ్యాన్ని గమనించడమే కాదు.. ఒకవేళ జారిపడినా, ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే పిల్లలకు అలర్ట్ పంపుతుంది.
పిల్లలు గనుక దగ్గర లేకపోతే అన్వయ కేర్ సెంటర్ తమ సిబ్బందిని వెంటనే పంపి అవసరమైన సాయం అందిస్తుంది. అంతేకాదు.. వయోవృద్ధుల్లో చాలా మందికి ‘డిమెన్షియా (మతిమరుపు)’వ్యాధి వస్తుంటుంది. ఏం చేస్తున్నామో కూడా తెలియని, అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వారికోసం కూడా ‘అన్వయ’లో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ వంటివాటితో పెద్దలను మానిటర్ చేస్తారు. నిర్ధారిత ప్రాంతం వదిలి పెద్దవారు బయటకి వెళ్తే.. వెంటనే పిల్లలకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడున్నారో ఆచూకీ చూపుతుంది.