ఆదానీ ఆస్తులను జప్తు చేయాలి:
సీపీఐ నేతల డిమాండ్
మైలవరం, ఫిబ్రవరి10: కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచేయి చూపటం శోచనీయమని, ఆదానీ ఆస్తులను జప్తు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం స్థానిక స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు చేయకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. దేశ సంపదను ఆదానీకి కట్టబెడుతూ దేశానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అదానీ ఆస్తులను జాతీయం చేయాలని మోడీ ప్రభుత్వాన్ని దించే వరకు మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితమే రాజభరణాల రద్దు బ్యాంకులను జాతీయం చేయటం జరిగిందని అలాంటిది మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి విమానాశ్రయాలు పోర్టులు రైల్వేలు అదానికి అప్పచెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్నారని భారత రాజ్యాంగంలో చెప్పినట్లు ప్రజలందరికీ జీవించే హక్కు జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అలాంటి మోడీ ప్రభుత్వం మేకప్ లో ఉండి అధాని లాంటి మచ్చని పెట్టుకుని మా ప్రభుత్వం పని తీరు బాగానే ఉందని పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పే ప్రధాని మోడీ ఒక్కడే అని అన్నారు ఈ నిరసన సభకు మైలవరం మండల సిపిఐ ఇన్చార్జ్ కార్యదర్శి బుద్ధవరపు వెంకటరావు అధ్యక్షత వహించగా నియోజవర్గ కార్యదర్శి బుడ్డి రమేష్, మహిళా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే రత్నకుమారి, బానోతు పెద బాలు, కే సీతయ్య, జై రాజు శివుడు ఆనంద్, రెడ్డిగూడెం మండల సిపిఐ కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.