– 3 నుంచి 6వ తేదీ వరకూ సైంటిఫిక్ సెషన్స్
– 3న ఏపీ గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్సీల రాక ఇస్రో, డీఏఈ అధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్
అమరావతి, నవంబరు 1(ఆంధ్రపత్రిక): ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 88వ వార్షిక సమావేశాలకు ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వేదికగా మారింది. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకూ ఆకాడమీ వార్షిక సదస్సులు జరుగనున్నాయి. వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా 3వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలు ఏర్పాటు చేసే ప్రతిష్టాత్మక సైంటిఫిక్ ఎగ్జిబిషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర అటవీ, పవర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గౌరవ అతిథిగానూ, ముఖ్యమంత్రి సలహాదారు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థ ఏటా మూడు రోజుల పాటు ఆకాడమీ వార్షిక సమావేశాలను నిర్వహిస్తుంటుంది. 1934లో బెంగళూరు కేంద్రంగా ఈ సమావేశాలు మొదలయ్యాయి. కాగా ఈ ఏడాది మన రాష్ట్రంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అరుదైన నిర్వహణ బాధ్యతలు లభించాయి. నవంబరు 4,5,6 తేదీల్లో ఈ సమావేశాలు యూనివర్సిటీలో జరగనున్నాయి.
నూతన పరిశోధనల ఆవిష్కరణలే సదస్సుల లక్ష్యం:
బోధన, పరిశోధనల్లో నాణ్యతే ఏ విద్యా సంస్థకైనా కీలకం. ఈ రెండు అంశాల్లోనూ భారత్ లోని వివిధ విశ్వవిద్యాలయాలు ప్రపంచ యవనికపై సత్తా బాటుతున్నాయి. ఫలితంగా దేశీయంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు తెరమీదకు వస్తున్నాయి. ఈ తరహా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు ఆలవర్చి కొత్త సృజనలకు ప్రాణం పోయడమే ఇండియన్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ లక్ష్యం. ఇందుకోసం ఏడాదికోసారి దేశంలోని వివిధ పట్టణాల్లో మూడు రోజుల పాటు వార్షిక సదస్సులు నిర్వహించి శాస్త్రవేత్తల సూచనలు, ఆలోచనలను ఔత్సాహిక-పరిశోధకులకు అందిస్తోంది. ప్రస్తుతం ఆకాడామీ ప్రెసిడెంట్‌గా ఉన్న డాక్టర్ యువీ వాగ్మరే కోరిక మేరకు 88వ వార్షిక సదస్సులను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు ఏపీ ఎస్ఆర్ఎంయూనివర్సిటీ ముందుకొచ్చింది. పరిశోధనా రంగంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ పండిరగ్ ఏజెన్సీలైన డిఎస్టీ, డీబీటీ, సీఎస్ ఆర్, డీఆర్ వో తదితర సంస్థల నుంచి ఎమినెంట్ సైంటిస్టులు సుమారు 300 మంది వరకూ హాజరవుతున్నారు. వీరందరికీ అవసరమైన అన్ని సదుపాయాలను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను ఆయా కమిటీలకు అప్పగించింది.
ప్రతిష్టాత్మకంగా సైంటిఫిక్ ఎగ్జిబిషన్: ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో సైంటిఫిక్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ సంస్థలు దీనికి సహకారం అందిస్తున్నాయి. ఉపగ్రహ ప్రయోగాల పరికరాలు, మోడల్ శాటిలైట్లు, ఇతరత్రా కీలక పరికరాలు, మెషీన్లను ప్రదర్శనలో ఉంచుతున్నారు. నాలుగు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ను అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు, కాలేజీ విద్యార్థులను యూనివర్సిటీ ఆహ్వానిస్తోంది. వీరికి అవసరమైన రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు ఏస్తోంది.
ఏర్పాట్లు పూర్తి: ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ వార్షిక సదస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను. యూనివర్సిటీ పూర్తి చేసింది. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మనోజ్ కే ఆరోరా. ప్రో. వైస్ ఛాన్సలర్ ఆచార్య నారాయణరావులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ బి రాజశేఖర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నాగరాణి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్లతో పాటు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డిలు హాజరవుతున్నారు.