విపక్ష ఐక్య కూటమిలో అంతా సవ్యంగా లేదని తేలిపోయింది. గత కొంతకాలంగానే జేడీయు అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యవహార తీరుతో ఇండియా కూటమిలో విబేధాలు నెలకొన్నాయని సంకేతాలు బయటకు వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రపంచ అగ్రనేతలకు ఇచ్చిన ప్రత్యేక విందులో నితీశ్ కుమార్ పాల్గొనడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
నరేంద్ర మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. విపక్ష ఐక్య కూటమిలో అంతా సవ్యంగా లేదని తేలిపోయింది. గత కొంతకాలంగానే జేడీయు అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యవహార తీరుతో ఇండియా కూటమిలో విబేధాలు నెలకొన్నాయని సంకేతాలు బయటకు వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రపంచ అగ్రనేతలకు ఇచ్చిన ప్రత్యేక విందులో నితీశ్ కుమార్ పాల్గొనడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంలోనే ప్రధాని మోదీని కూడా సుదీర్ఘ విరామం తర్వాత కలిశారు నితీశ్ కుమార్. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఆయన మోదీని కలవడం ఇదే తొలిసారి. నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఇండియా కూటమిఏర్పాటులో కీలక చొరవ చూపించిన నితీశ్.. గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న తీరు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి వ్యతిరేకమైన చర్చా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ 14 మంది టీవీ యాంకర్లను ఆ కూటమి బ్యాన్ చేసింది. వీరు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో ఇండియా కూటమి ప్రతినిధులు ఎవరూ పాల్గొనవద్దని నిర్ణయించింది. ఇండియా కూటమి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీజేపీ.. ఇది ఎమర్జెన్సీ తరహా మనస్తత్వమంటూ మండిపడింది. మీడియాపై ఇండియా కూటమి బెదిరింపులకు దిగడం సరికాదని పేర్కొంది.
ఆ నిర్ణయం తెలియదు: నితీశ్ కుమార్..
ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయు అధినేత నితీష్ కుమార్ ఈ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంరేపుతున్నాయి. కొందరు జర్నలిస్టులను ఇండియా కూటమి బ్యాన్ చేసిన విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. ఈ విషయంలో తాను జర్నలిస్టులకు మద్ధతు ఇస్తానంటూ ప్రకటన చేశారు. జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఉంటేనే.. వారు ఏమైనా స్వేచ్ఛాయుతంగా రాయగలరని చెప్పారు. జర్నలిస్టులను కంట్రోల్ చేసే ప్రయత్నాలు సరికాదని, వారికి హక్కులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు ఎవరికీ తాను వ్యతిరేకం కాదని నితీశ్ కుమార్ స్పష్టంచేశారు.
నితీశ్ కుమార్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియా కూటమిలో అంతా సవ్యంగా లేదని తేలిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడిన రాజకీయ కూటమి.. ఎంతో కాలం ఐక్యంగా ఉండలేదని ఆ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం నాడు ఇండియా కూటమిపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడిన కూటమిగా అభివర్ణించారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయు, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మధ్య బంధం నీరు – ఆయిల్ మధ్య బంధమని వ్యాఖ్యానించారు.