దిల్లీ: వరదనీట మునిగి విద్యార్థుల మృతి ఘటనకు నిరసనగా దిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ ఎదుట గత రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న సివిల్స్ ఆశావహులు మూడోరోజైన మంగళవారం నిరవధిక నిరాహారదీక్షలు ప్రారంభించారు.
10 మంది ఈ దీక్షలకు కూర్చొన్నారు. ముగ్గురు విద్యార్థుల మరణంపై బాధిత కుటుంబాలకు రూ.5 కోట్ల చొప్పున పరిహారం వంటి తమ ప్రధాన డిమాండ్లు నెరవేరేదాకా దీక్షలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాలు అన్నింటితో నిర్దిష్ట కాలవ్యవధిలోపు కమిటీ నివేదిక ఇవ్వాలి.. దిల్లీ వ్యాప్తంగా సెల్లార్లను గ్రంథాలయాలుగా, తరగతి గదులుగా ఉపయోగించడంపై నిషేధం విధించాలన్నది తమ ఇతర డిమాండ్లుగా విద్యార్థులు వివరించారు. కాగా, ఘటన జరిగిన మొదటిరోజు ప్రచారంలోకి వచ్చినట్టుగా సెల్లార్లో బయోమెట్రిక్ లాకింగ్ ద్వారం ఏదీ లేదని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భవనం ముందు నుంచి వాహనం వేగంగా నడిపి, గేట్లు తెరుచుకోడానికి కారకుడైన ఎస్యూవీ డ్రైవరుతోపాటు నలుగురు భవన యజమానుల బెయిలు దరఖాస్తులపై వాదనలు విన్న దిల్లీ కోర్టు బుధవారం సాయంత్రానికి తీర్పును రిజర్వు చేసింది. విద్యార్థుల మరణానికి ఆప్ సర్కారు నిర్లక్ష్యమే కారణమని నిరసన తెలుపుతూ భాజపా నేతలు రాజ్‌ఘాట్ వద్ద బైఠాయించి మౌన ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం నాటికి మొత్తం 29 కోచింగ్ సెంటర్ల సెల్లార్లను అధికారులు సీజ్ చేశారు.
10 X 10 గదికి రూ.15 వేల అద్దె!
దిల్లీలో చాలామంది విద్యార్థులు ఇరుకైన గదుల్లో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో సివిల్స్ విద్యార్థులు దిల్లీలో నిత్యం ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారు ఉంటున్న ఓ గది వీడియో వైరల్‌గా మారింది. 10 x 10 వైశాల్యం ఉన్న గదికి యజమానులు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ఈ వీడియోను డీఎస్పీ అంజలి కటారియా తన ఖాతాలో షేర్ చేసి, విద్యార్థుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ”కేవలం ఇంటి నుంచి దూరంగా ఉండాలని దిల్లీకి రావొద్దు. ఆన్లైన్ వీడియో పాఠాల ద్వారా చదువుకోడానికి ఈ గదుల్లో ఉంటూ ఇంత మొత్తం చెల్లించడం ఆలోచించాల్సిన విషయం” అని పోస్టు చేశారు.
ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ
రావూస్ కోచింగ్ సెంటర్ ఉదంతంపై దిల్లీ ప్రభుత్వంతోపాటు మున్సిపల్ కమిషనర్, నగర ప్రధాన పోలీసు అధికారికి మంగళవారం జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును సుమోటోగా తీసుకొన్నట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. గత వారం పటేల్ నగర్లోనూ వరదనీటిలో రోడ్డు దాటుతూ విద్యుదాఘాతానికి గురై మరణించిన మరో సివిల్ విద్యార్థి ఘటనను సైతం సుమోటోగా తీసుకొన్నట్లు వెల్లడించింది.