కాంట్రాక్టు ఉద్యోగులనూ క్రమబద్ధీకరిస్తాం
ప్రభుత్వ ఉద్యోగులకు కాలనుగుణంగా ప్రమోషన్లు కల్పిస్తాం
రాహుల్ గాంధీ
న్యూధిల్లీ,అక్టోబరు 30(ఆంధ్రపత్రిక): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఉద్యోగులకు పాత పింఛను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
దీంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు కాలనుగుణంగా ప్రమోషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తోన్న రాహుల్ గాంధీ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. రాజస్థాన్‌లో పాత పింఛను విధానం అమలు చేస్తున్నామని.. గుజరాత్లో తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉద్యోగులకు బకాయిలు వస్తాయని పేర్కొన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఓటర్లను తమ వైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇటీవల పంజాబ్‌లో పాత పింఛను పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించిన ఆప్.. త్వరలో ఎన్నికలు జరగబోయే హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌లలోనూ తమకు అధికారం ఇస్తే పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని అక్కడి ఉద్యోగులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.