Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన చరిత్ర సృష్టించింది.
టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు అందుకోవడం ఇదే రెండోసారి. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే.
శనివారం రాత్రి బార్బడొస్‌లో జరిగిన ఫైనల్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగలు వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.
ఈ విజయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ మాటకొస్తే ఇదొక్కటే కాదు- భారత జట్టు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడిన ప్రతీ ఫైనల్ మ్యాచ్‌కూ సారూప్యత ఉంది. ఓ లింక్ ఉంది. అది- మలయాళీ క్రికెటర్లతో అనుసంధానం ఉండటం. భారత్ గెలిచిన ప్రతీసారీ జట్టులో ఓ మలయాళీ ప్లేయర్ ఉంటూ వస్తోన్నాడు. మలయాళీ ప్లేయర్ లేని ఐసీసీ నిర్వహించిన ఏ ఒక్క టోర్నమెంట్‌ను కూడా భారత్ గెలుచుకోలేదు.
1983లో తొలిసారిగా వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ జట్టులో మలయాళీ ప్లేయర్ ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. అండర్ డాగ్‌గా ఆ టోర్నమెంట్‌ను ఆరంభించిన కపిల్ దేవ్ సేన.. చివరికి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. ఫైనల్స్‌లో అరివీర భయంకరమైన వెస్టిండీస్‌ను ఓడించి కప్‌ను అందుకుంది.
ఆ జట్టులో మలయాళీ క్రికెటర్ భాగస్వామి. ఆయన పేరు సునీల్ వాల్సన్. తుదిజట్టులో ఆడకపోయినప్పటికీ- 14 మంది సభ్యుల్లో ఆయనా ఒకరు. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన క్రికెటర్ సునీల్. ఫైనల్స్‌కు ముందు గాయపడ్డ రోజర్ బిన్నీ స్థానంలో తుదిజట్టులో ఆయనను తీసుకోవాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు. బిన్నీ కోలుకోవడంతో తుదిజట్టులో స్థానం నిలుపుకొన్నాడు.
కేరళకే చెందిన మరో క్రికెటర్.. శ్రీశాంత్. పేస్ బౌలర్. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. ఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై నాలుగు ఓవర్ల కోటాలో 44 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లతో 12 పరుగులతో దూకుడు మీద ఉన్న సొహైల్ తన్వీర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన వికెట్ అది.
2011లో టీమిండియా గెలిచిన ఐసీసీ వరల్డ్ కప్‌లోనూ శ్రీశాంత్ భాగస్వామే. ఫైనల్స్‌లో ఎనిమిది ఓవర్లు వేశాడు గానీ వికెట్ తీయలేకపోయాడు. ఇప్పుడు మరో మలయాళీ క్రికెటర్ సంజు శాంసన్ వంతు వచ్చింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా టీ20 వరల్డ్ కప్ 2024కు సెలెక్ట్ అయ్యాడు సంజు. జట్టులో సభ్యుడే అయినా ఫైనల్స్ ఆడలేదు.
మలయాళీ ప్లేయర్ లేని ఐసీీసీ టోర్నమెంట్‌ను కూడా భారత్ గెలచుకోలేకపోవడం కాకతాళీయమే కావొచ్చు. ఐసీసీ వరల్డ్ కప్ గానీ, టీ20 ప్రపంచ్ కప్ టోర్నమెంట్లల్లో గానీ కేరళ వాళ్లు లేని ఏ ఒక్కటి కూడా గెలవలేదు. గత ఏడాది జరిగిన ఐసీీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు.