- అవినీతి,అక్రమాలకు ప్రతిరూపం జగన్
- మూడేళ్లలో ఒక్క అభివృద్ది కార్యక్రమం లేదు
- నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రాకుండా చేశారు
- ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు
- అవినీతి అధికారులను వదిలే ప్రసక్తి లేదు
- టిడిపి గాలిలో వైసిపి, జగన్ కొట్టుకు పోవడం ఖాయం
- కర్నూలు పర్యటనలో చంద్రబాబు విమర్శలు
కర్నూలు,నవంబర్ 16 (ఆంధ్రపత్రిక): అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్‌రెడ్డి అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరులో చంద్రబాబు పర్యటలో భాగంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది టీడీపీయేనని అన్నారు. ఈ మూడేళ్లలో ఒక్క పని అయినా చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం.. జగన్‌రెడ్డి అని విమర్శించారు. దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నది ఏపీలోనే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శనికి కారణం జగన్ మోహన్ రెడ్డి కారణమన్నారు. రాష్ట్రంలో సీఐడీ పనికిమాలిన శాఖగా మారిందన్నారు. తప్పు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ గాలి వీస్తోందని.. ఈ గాలిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి అన్నారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపమని దుయ్యబట్టారు. కోడుమూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మట్టి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్ సహా అన్నీ నంద్యాల
జిల్లాకు వెళ్లిపోయాయని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని.. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది తెలుగు దేశం పార్టీయేనని చెప్పారు. రాష్ట్రంలో, అన్ని పన్నులు పెంచారని.. చివరికి చెత్తపైన కూడా పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల కు కారణం సీఎం జగన్మోహన్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్రంలో సీఐడీ ఒక పనికి మాలిన శాఖగా మారిందని ఆరోపించారు. తప్పు చేసిన అధికారులను వచ్చే తమ ప్రభుత్వంలో వదిలేది లేదని హెచ్చరించారు. తొలుత చంద్రబాబు నాయుడుఓర్వకల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు, విద్యార్థులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ఎయిర్ పోర్ట్ వద్ద విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకున్నారు. ’జాబు రావాలి అంటే.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టారన్నారు. కర్నూల్ ఇండస్టియ్రల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామన్నారు. కర్నూలు జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని, సోలార్ పార్క్ తెస్తే కవిూషన్ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారని.. అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారని చంద్రబాబు అన్నారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరన్నారు. ప్రతి కార్యక్రమం ఇక్కడ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. హైదరాబాద్ ఉన్న తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధి చెందాలని అనుకున్నామని, అందుకే అమరావతి తలపెట్టామని స్పష్టం చేశారు. యువతలో చైతన్యం రావాలని, వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని.. నాడు వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా? అని అన్నారు. కర్నూల్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిపివేశారని విమర్శించారు. జగన్ రెడ్డి తండ్రి వైఎస్‌ను కూడా గౌరవించలేదని, అయన తెచ్చిన వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించారన్నారు. కర్నూల్లో పరిశ్రమలు రావాలని 10 వేల ఎకరాలలో టౌన్ షిప్ తెచ్చామన్నారు. నాడు సోలార్ ప్రాజెక్టులు తెచ్చి ఉపాధి కల్పించామన్నారు. నేడు రాయలసీమ యూనివర్సిటీలో సిబ్బందికి కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డిని గెలిపించమని కోరారు. యువత భవితకు తనది భరోసా అని చంద్రబాబు స్పష్టం చేశారు.