దిల్లీ: కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే మోదీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో విలీనం ఖాయమని అన్నారు. అంతేకాకుండా.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. దిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న బిశ్వశర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
”డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు చేశారని సచిన్ తెందూల్కర్‌ను అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేవిధంగా గత లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లతో గెలుపొందిన భాజపా.. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఎన్నికల్లో ఒకవేళ 400 సీట్లు సొంతం చేసుకుంటే శ్రీ కృష్ణుడి జన్మస్థలం మథురలో దేవాలయాన్ని, వారణాసిలో బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తుంది. దీంతో పాటు పీవోకేను భారత్‌లో విలీనం చేసేందుకు కృషి చేస్తుంది” అని హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో పీవోకే అంశంపై పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీపై హిమంత విమర్శలు గుప్పించారు.
ఆ విషయంలో సందేహం లేదు: అమిత్ షా
మరోవైపు పీవోకేలో ప్రస్తుతమున్న పరిస్థితిపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. ‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్లో శాంతి నెలకొంది. కానీ, ప్రస్తుతం అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆజాదీ నినాదాలు వినిపిస్తున్నాయి. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుందనడంలో సందేహం లేదు. దాన్ని తిరిగి మన దేశంలో కలిపేందుకు కృషి చేస్తాం” అని షా పేర్కొన్నారు.
ఇదేమీ అతిశయోక్తి కాదు: జై శంకర్
”పీవోకేలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. సోషల్ మీడియా, టీవీల్లో వాటిని చూస్తున్నాం. అక్కడి పరిస్థితులను విశ్లేషించడం కష్టమే. కానీ.. అక్కడ నివసిస్తున్నవారంతా జమ్మూలో ఉంటున్న వారితో తమ పరిస్థితిని పోల్చుకుంటున్నారు. ఈ విషయం నిజమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అక్కడ జరుగుతోన్న అభివృద్ధిని ప్రజలంతా కళ్లారా చూస్తున్నారు” అని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ పేర్కొన్నారు.